తెలుగు రాష్ట్రాల మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్..

భారత్ న్యూస్ విశాఖపట్నం..తెలుగు రాష్ట్రాల మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్..

తెలుగు రైల్వే ప్రయాణికులకు శుభవార్త. మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు తెలుగు ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా ఈ అమృత్ భారత్ రైలు నడవబోతోంది. జనవరి 23, 2026న కేరళలోని తిరువనంతపురం నుంచి ఈ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. తిరువనంతపురం- చర్లపల్లి మధ్య ఈ అమృత భారత్ రైలు నడవనుంది.

ఇప్పటికే చర్లపల్లి-ముజఫర్ పూర్ (బీహార్) మధ్య ఒక అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ నడుస్తోంది. తిరువనంతపురం- చర్లపల్లి మధ్య నడిచే ఈ రైలు తెలంగాణకు కేటాయించిన రెండో అమృత్ భారత్ రైలు. ఈ రైలు ప్రతి మంగళవారం చర్లపల్లి నుంచి ఉదయం 7.15కు బయలుదేరి.. మరుసటి రోజు (బుధవారం) మధ్యాహ్నం 2.45కు తిరువనంతపురం చేరుకుంటుంది. అక్కడి నుంచి తిరిగి బుధవారం సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి, తర్వాతి రోజు రాత్రి 11.30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.

ఈ రైలు తెలంగాణలోని నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్లతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఆధునిక పద్ధతుల్లో, స్వదేశీ సాంకేతికతతో డిజైన్ చేశారు. వివిధ సౌకర్యాలను అందించే ఈ రైళ్లు అందుబాటు ధరల్లోనే ప్రయాణికులకు సేవలు అందించబోతున్నాయి.