భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.ముగిసిన దావోస్ పర్యటన… అమెరికాకు బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి, వివరాలు ఇవే
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. అయితే దావోస్ పర్యటన ముగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి అమెరికా బయలుదేరి వెళ్లారు.
వివరాలు… దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో తెలంగాణ రైజింగ్ 2047 నిర్దేశిత లక్ష్యాలు, దార్శనికతను ప్రపంచానికి చాటడంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం సఫలీకృతమైందని సీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది.
”హైదరాబాద్‌లో గత నెలలో జరిగిన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో రాష్ట్ర ప్రభుత్వం 5.75 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించింది. ఆ నేపథ్యంలో 2026 ప్రపంచ ఆర్థిక వేదికలో పెట్టుబడులకు మించి రాష్ట్ర భవిష్యత్ ప్రణాళికలు, సమగ్రాభివృద్ధిపై తెలంగాణ రైజింగ్ విజన్ లక్ష్యాలు, బృహత్ ప్రణాళికలను ప్రపంచానికి చాటి చెప్పాలన్న ప్రభుత్వ సంకల్పం నెరవేరింది. మూడు రోజుల పాటు సాగిన ఈ పర్యటనలో ప్రతినిధి బృందం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ, తయారీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించింది. అలాగే ప్రభుత్వం ఏఐ, సస్టైనబిలిటీ, స్కిల్లింగ్ కార్యక్రమాలకు సంబంధించిన పలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది” అని సీఎంవో ప్రకటనలో పేర్కొంది.
సీఎం రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనమిక్ ఫోరం నిర్వహించిన రెండు కీలక సెషన్లలో పాల్గొన్నారని తెలిపింది. దావోస్ 2026 సదస్సు అనంతరం ఫాలో అప్‌గా జూలై – ఆగస్టు నెలల్లో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి సదస్సులో చేసిన ప్రతిపాదనకు సానుకూల స్పందన లభించిందని పేర్కొంది. ఈ మూడు రోజుల్లో ప్రపంచ స్థాయి ప్రముఖ కంపెనీలు, పారిశ్రామిక దిగ్గజాలతో 12 ముఖాముఖి సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారని తెలిపింది.
అమెరికాకు ఎందకు?
దావోస్ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి జూరిచ్ బయల్దేరారు. అక్కడి నుంచి_ అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. తెలంగాణ ప్రతినిధి బృందంలో భాగంగా ఉన్న మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు , పొంగులేటి శ్రీనివాస రెడ్డిలు హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు.

హార్వర్డ్ యూనివర్శిటీ అందజేస్తున్న ‘లీడర్‌షిప్ ఫర్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ: కేయాస్, కాన్‌ఫ్లిక్ట్, అండ్ కరేజ్’ అనే ప్రత్యేక కోర్సులో చేరిన సీఎం రేవంత్ రెడ్డి అందులో భాగంగా క్లాసులకు హాజరుకానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన అమెరికా వెళ్లారు. కోర్సులో భాగంగా మసాచుసెట్స్‌లోని హార్వర్డ్ కెన్నడీ స్కూల్ క్యాంపస్‌లో జనవరి 25 నుంచి 30 వరకు స్పెషల్ క్లాసులు జరుగనున్నాయి. వాస్తవ ప్రపంచంలోని సమస్యలను కేస్ స్టడీస్‌గా తీసుకుని, వాటికి పరిష్కారాలు కనుగొనడంపై ఈ కోర్సులో ప్రధానంగా దృష్టి సారిస్తారు. యూనివర్శిటీ నుంచి సర్టిఫికెట్ అందుకున్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ తిరిగి రానున్నారు.