నూతన కరికుల నిర్మాణం శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి పథంలో శాస్త్రీయ దృక్పథంతో జరగాలి!

భారత్ న్యూస్ డిజిటల్:హైదరాబాద్:

నూతన కరికుల నిర్మాణం శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి పథంలో శాస్త్రీయ దృక్పథంతో జరగాలి!

  • ముత్యాల రవీందర్,
    రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి,
    TPTF

ఇస్సామియా బజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో నేడు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ హైదరాబాద్ జిల్లా శాఖ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు పి.వెంకటేశ్వర ప్రసాద్ అధ్యక్షత వహించగా, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ముత్యాల రవీందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆయన జిల్లా కమిటీని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుతం విద్యా రంగంలో ఉపాధ్యాయులు అనేక మానసిక ఒత్తిడిలో ఉన్నారని, వారిని చూసి కొత్తగా ఉపాధ్యాయ వృత్తి లోకి రావాలనుకునే యువతను నిరుత్సాహపరిచే విధంగా విద్యారంగంలోని సమస్యలు ఉన్నాయని ఆయన అన్నారు.
ప్రభుత్వ విద్యారంగంలో అనేక సంస్కరణల్ని తీసుకొస్తానని చెబుతున్న ప్రభుత్వం ముందుగా ఉపాధ్యాయులు స్వేచ్ఛాయుత వాతావరణంలో విద్య మరియు పాఠ్య ప్రణాళికలకు లోబడి పనిచేసే వాతావరణం కల్పించాలని; అధికారులు మారినప్పుడల్లా విద్యాశాఖ చేసే అనవసర ప్రయోగాలు పూర్తిగా బోధనభ్యాసన ప్రక్రియలకు అంతరాయంగా మారుతున్నాయని అన్నారు.
అట్లే దాదాపు దశాబ్ద కాలం తర్వాత మారబోతున్న కరికులంలో వైద్య, విజ్ఞాన, సాంకేతిక శాస్త్రాలకు మరియు రాజ్యాంగ పరిధి లోని అంశాలకు ప్రాధాన్యతనిస్తూ శాస్త్రీయ దృక్పథాలను పెంచేలా కరికులం తయారుచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పెండింగ్ లోనున్న ఉపాధ్యాయుల అన్ని రకాల ఆర్థిక బిల్లులను వెంటనే మంజూరు చేయాలని; పెండింగ్లోని 4 డీ.ఏ. లను వెంటనే చెల్లించాలని; మూడేళ్లుగా పెండింగ్లోనున్న పీఆర్సీ నివేదికను తెప్పించుకొని వెంటనే అమలు చేయాలని; అద్దె భవనాల్లో నడుస్తున్న ప్రభుత్వ పాఠశాలల్ని సొంత భవనాలు నిర్మించి మాత్రమే వాటిలోకి తరలించాలని; ప్రతి ప్రభుత్వ పాఠశాలకు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను; గుమాస్తా పోస్టులను నింపి కార్యాలయ పని ఒత్తిడిని తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, జాతీయ పెన్షన్ పథకం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాథమికోపాధ్యాయులకు ఓటు హక్కు కల్పించాలని, జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని, పాఠశాలల విలీనం, మూసివేతను వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్స్ (AIJACTO) ఆధ్వర్యంలో డిల్లీలో ఫిబ్రవరి 9న మార్చ్ టు పార్లమెంట్ కార్యక్రమానికి ఉపాధ్యాయులు తరలి రావాలని పిలుపునిచ్చారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాంబాబు మాట్లాడుతూ TET ను, CPS రద్దు చేయాలనే ఉద్యమంలో అందరూ పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కౌన్సిలర్లు ఎస్ రామానందయ్య, ఏ రమణారావు, ఉపాధ్యక్షులు డా. ఎం.సురేందర్, ఎం. వెంకటేశ్వర రెడ్డి, సీతారామ శాస్త్రి, కార్యదర్శులు అందేకర్ రవి, శ్రీమతి వెంకటరమణ, శ్రీమతి అన్నపూర్ణ దేవి, జగదీష్, తదితరులు పాల్గొన్నారనీ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాంబాబు
తెలిపారు.