రూ.547 కోట్ల సైబర్‌ మోసానికి చెక్‌ – ప్రధాన నిందితుడు పోట్రు మనోజ్‌ కల్యాణ్‌ అరెస్ట్

భారత్ న్యూస్ హైదరాబాద్….రూ.547 కోట్ల సైబర్‌ మోసానికి చెక్‌ – ప్రధాన నిందితుడు పోట్రు మనోజ్‌ కల్యాణ్‌ అరెస్ట్

హైదరాబాద్‌: రూ.547 కోట్ల భారీ సైబర్‌ క్రైమ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సత్తుపల్లికి చెందిన పోట్రు మనోజ్‌ కల్యాణ్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిన్న రాత్రి హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. అంతర్జాతీయ సైబర్‌ నేరగాళ్లతో కలిసి దేశవ్యాప్తంగా బాధితులను లక్ష్యంగా చేసుకుని వందల కోట్ల రూపాయల మోసాలకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

వివిధ డిజిటల్‌ మాధ్యమాల ద్వారా నకిలీ పెట్టుబడి పథకాలు, ఆన్‌లైన్‌ మోసాల వల వేసి భారీ మొత్తంలో డబ్బు దోచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మనోజ్‌ కీలకంగా వ్యవహరించి నేరగాళ్ల నెట్‌వర్క్‌ను సమన్వయం చేసినట్టు సమాచారం. ఈ కేసులో ఇంకా నలుగురు సైబర్‌ నేరగాళ్లు పరారీలో ఉండగా, వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.

అరెస్ట్‌ అయిన నిందితుడిని కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. సైబర్‌ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులు, ఆఫర్లు దూరంగా ఉంచాలని అధికారులు సూచించారు.