భారత్ న్యూస్ డిజిటల్:హైదరాబాద్:
నుమాయిష్ వేదికగా.. రహదారి భద్రత పాఠాలు
హైదరాబాద్ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే నుమాయిష్ లో నగర పోలీసులు సందడి చేశారు. ప్రజలకు రక్షణ, వివిధ భద్రతాంశాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా నగర పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. వీటిని నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ గారు, ఏసీబీ, మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ చారుసిన్హా గారు బుధవారం ప్రారంభించారు.
నగర సీపీ సజ్జనర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ అనగానే చార్మినార్, బిర్యానీతో పాటు నుమాయిష్ కూడా నగర గుర్తింపులో ఒక భాగమని పేర్కొన్నారు. 1938లో కేవలం పదుల సంఖ్యలో స్టాల్స్‌తో ప్రారంభమైన ఈ ప్రదర్శన.. నేడు దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రదర్శనగా ఎదిగిందన్నారు. 85 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ వేదిక జాతీయ సమైక్యతకు, గంగా-జమునా తహజీబ్ సంస్కృతికి అద్దం పడుతోందని కొనియాడారు.
పోలీసు సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే ఈ స్టాల్స్ ఏర్పాటు వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశమని సీపీ తెలిపారు. ప్రధానంగా మహిళల రక్షణ కోసం పనిచేస్తున్న ‘షీ టీమ్స్’ పనితీరు, ప్రస్తుత కాలంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇక్కడ ప్రత్యేక అవగాహన కల్పిస్తామని వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పకుండా పోలీసు స్టాల్స్‌కు తీసుకురావాలని, చిన్ననాటి నుంచే వారికి రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కల్పిస్తే బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారని సూచించారు. రాత్రింబవళ్లు శ్రమిస్తున్న ట్రాఫిక్ విభాగం పనితీరును, జాయింట్ సిపి జోయల్ డెవిస్‌ను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.
అదనపు డీజీపీ చారుసిన్హా గారు మాట్లాడుతూ.. ఉమెన్ సేఫ్టీ వింగ్, భరోసా, షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ మహిళలకు భద్రతపై పూర్తి భరోసా కల్పిస్తాయన్నారు. సందర్శకులకు చట్టాలపై అవగాహన కల్పించడానికి ఇదొక మంచి వేదికని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్బంగా ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు నగర పోలీసులకు రూ.15 లక్షల విరాళ చెక్కును అందజేశారు.

కార్యక్రమంలో జాయింట్ సీపీ (ట్రాఫిక్) డి. జోయల్ డెవిస్, డీసీపీలు రాహుల్ హెగ్డే, జి. చంద్రమోహన్, వి. అరవింద్ బాబు, లావణ్య నాయక్ జాదవ్, ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు సుకేష్ రెడ్డి, కార్యదర్శి బి.ఎన్. రాజేశ్వర్, కోశాధికారి డాక్టర్ ఎన్. సంజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
**.