బాపట్ల పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో మిన్నంటిన సంక్రాంతి సంబరాలు

భారత్ న్యూస్ డిజిటల్,:అమరావతి:

“బాపట్ల పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో మిన్నంటిన సంక్రాంతి సంబరాలు

కుటుంబసమేతంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు.

ఆకట్టుకున్న మహిళా పోలీసులు వేసిన రంగవల్లులు

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి

జిల్లా ప్రజలకు, మీడియా మిత్రులకు, పోలీస్ సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు

జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమా మహేశ్వర్ ఐపిఎస్ గారు.

ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపిఎస్ గారు ప్రజలకు సూచించారు. తెలుగువారి అతిపెద్ద పండుగ, సంస్కృతికి ప్రతీక అయిన సంక్రాంతిని పురస్కరించుకుని బాపట్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో “సంక్రాంతిt సంబరాలు – 2026” అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు జిల్లా ఎస్పీ గారు ముఖ్య అతిథిగా కుటుంబ సమేతంగా విచ్చేసి వేడుకలలో పాల్గొన్నారు.

నిత్యం శాంతిభద్రతల పరిరక్షణలో, కేసుల దర్యాప్తులో తలమునకలయ్యే పోలీస్ అధికారులు, సిబ్బంది, సంక్రాంతి వేడుకలలో తమ వృత్తిపరమైన ఒత్తిడిని పక్కన పెట్టి ఉత్సాహంగా ఈ సంబరాల్లో పాల్గొన్నారు. పరేడ్ గ్రౌండ్ అంతా ఒక పల్లెటూరిని తలపించేలా ఎడ్లబండ్లు, రంగురంగుల రంగవల్లులు, డూడూబసవన్నల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, మహిళల కోలాట, చిన్నారుల భరతనాట్యం నృత్యాల ప్రదర్శన తదితర కార్యక్రమాలు అలరించాయి. భోగిమంటలు వేసి వాటి చుట్టూ మహిళలు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.

పండుగ శోభను రెట్టింపు చేస్తూ మహిళా పోలీస్ అధికారులు మరియు సిబ్బంది వేసిన రంగవల్లులు (ముగ్గులు) అందరినీ ఆకట్టుకున్నాయి. తెలుగు సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా గొబ్బెమ్మలు,t హరిదాసులు, బసవన్నల చిత్రాలతో వేసిన ముగ్గులను ఎస్పీ గారు, వారి కుటుంబ సభ్యులు స్వయంగా తిలకించి, వారి సృజనాత్మకతను మనసారా అభినందించారు.

సంబరాలలో భాగంగా పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి నిర్వహించిన కబడ్డీ, వాలీబాల్ పోటీలు అత్యంత ఉత్కంఠగా సాగాయి. చిన్నారులకు నిర్వహించిన పెయింటింగ్, మ్యూజికల్ చైర్స్, మహిళలకు నిర్వహించిన మ్యూజికల్ చైర్స్ పోటీలు ఆహ్లాదకరంగా సాగాయి. ఎస్పీ గారు స్వయంగా దగ్గరుండి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. గెలుపోటముల కంటే టీమ్ స్పిరిట్ ముఖ్యమని ఈ పోటీలు నిరూపించాయి.

జిల్లా ఎస్పీ గారు తెలుగుదనం ఉట్టిపడే వస్త్రధారణలో ఎద్దుల బండి పై ప్రయాణించి అలరించారు, క్రీడాపోటీలను వీక్షించి విజేతలకు బహుమతులు అందజేశారు, బసవన్నల ఆహారం అందించారు, రంగవల్లుల పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరు విజేతలుగా ప్రకటించి అందరికి బహుమతులు అందజేశారు. అనంతరం క్యాంప్ ఫైర్ వెలిగించి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్న పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. పోలీస్ కుటుంబ సభ్యులందరూ ఒకే కుటుంబంలా కలిసి ఈ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. సంక్రాంతి అనేది కేవలం ఒక వేడుక మాత్రమే కాదని, దీని వెనుక ఎంతో లోతైన అర్థం ఉందని పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ కష్టానికి ప్రతిఫలమని, శ్రమకు గుర్తింపు అని, కుటుంబ బాంధవ్యాలకు బలం చేకూర్చే పండుగని తెలిపారు. రైతు ఏడాది పొడవునా కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే శుభ తరుణం ఇదని, రైతులు, రైతు కూలీలతో పాటు అనేకమంది తమ శ్రమకు గుర్తింపుగా ఈ పండుగను జరుపుకుంటారని వివరించారు. తెలుగువారు దేశవిదేశాల్లో ఎక్కడ ఉన్నా సరే, సంక్రాంతికి తమ స్వస్థలాలకు చేరుకుని మన సంస్కృతి సంప్రదాయాలను మేళవిస్తూ, రేపటి తరాలకు వాటి విలువలను తెలియజేసేలా ఈ పండుగను జరుపుకుంటారని కొనియాడారు.

ఇతర శాఖల విధులతో పోలిస్తే పోలీస్ శాఖలో విధులు చాలా విభిన్నంగా ఉంటాయని, రాత్రనక పగలనక శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా 24 గంటలు నిరంతరం విధులు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పండుగలు, వేడుకలు లేదా కుటుంబంలో ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నప్పటికీ, వాటన్నింటినీ పక్కన పెట్టి ప్రజా భద్రతకే తాము ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఇలా నిరంతరం సమాజం కోసం పని చేసే క్రమంలో ఉండే ఒత్తిడి నుండి కొద్దిపాటి విరామం పొందడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు. జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ల నుండి వచ్చిన పోలీస్ అధికారులు, సిబ్బంది, మహిళా పోలీసులు ఉదయం నుండి ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ఆటలు, కోలాటం, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల నృత్యాలతో అలరించడం పాత మధుర స్మృతులను, పల్లెటూరి వాతావరణాన్ని గుర్తుకు తెస్తున్నాయని తెలిపారు.

ప్రస్తుతం మనమంతా సాంకేతిక యుగంలో వేగంగా ముందుకు వెళ్తున్నామని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ అభివృద్ధి చెందడం ఎంత ముఖ్యమో, మన సంస్కృతి సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను మరువకుండా ఉండటం కూడా అంతే ముఖ్యమని సూచించారు. పండుగల ఉద్దేశాలను గ్రహించి అందరూ కూడా కుటుంబ బాంధవ్యాలను బలోపేతం చేసుకుంటూ ఆహ్లాదకరమైన వాతావరణంలో పండుగలు జరుపుకోవాలన్నారు. అదేవిధంగా, బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం నేర నియంత్రణలో, శాంతిభద్రతల పరిరక్షణలో మరియు ప్రజలకు చేరువయ్యేలా అనేక కార్యక్రమాలు చేపట్టడంలో సమర్థవంతంగా పనిచేస్తోందని, రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంతో పనిచేస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. జిల్లా పోలీస్ శాఖలోని హోంగార్డు నుండి ఉన్నత స్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్కరూ ఐక్యతతో, పరస్పర గౌరవంతో సమిష్టిగా పనిచేసి జిల్లా పోలీస్ ఖ్యాతిని పెంపొందించాలని కోరారు.

ఈ సంక్రాంతి పండుగ మనందరిలో కొత్త ఉత్సాహాన్ని, మంచి ఆలోచనా శక్తిని నింపాలని, రాబోయే రోజుల్లో మరింత సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ బాపట్ల జిల్లా ప్రజానీకానికి మరింత చేరువవుతూ రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా నిలవాలని ఆకాంక్షించారు. పోలీస్ సిబ్బంది 24 గంటలు విధి నిర్వహణలో ఉండటానికి వారి కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉందని, వారి మద్దతును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు. ఈ సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో సుఖసంతోషాలను, ఆరోగ్యాన్ని నింపాలని ఆయన ఆకాంక్షించారు.

ఎస్పీ గారు జిల్లా ప్రజలకు, పాత్రికేయులకు ప్రత్యేకంగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నూతన కాంతులు, సంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాల మేళ వింపుతో కుటుంబసభ్యులు, ఇంటిల్లిపాది సంతోషంగా సంక్రాంతి పండుగను నిర్వహించుకోవాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల జోలికెళ్లకుండా మకర సంక్రాంతి ఆనందంగా జరుపుకోవాలని తెలియజేశారు. సంక్రాంతి పండగను పురస్కరించుకొని బంధువుల ఇళ్లకు, స్వగ్రామాలకు ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రజలు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు. హెల్మెట్ ధరించడం వల్ల ఏదైనా అనుకోని ప్రమాదం చోటు చేసుకున్న ప్రాణాపాయం నుండి బయటపడే అవకాశం ఉంటుందన్నారు. మీ నిర్లక్ష్యం విలువ మీ కుటుంబాలలో తీరని లోటు మిగిల్చే అవకాశం ఉందని గుర్తించాలన్నారు. ప్రయాణాలు చేసే సమయంలో అప్రమత్తంగా ఉంటూ రోడ్డు భద్రత నియమాలను ప్రతి ఒక్కరు పాటించాలని తెలిపారు. జూద క్రీడలకు దూరంగా ఉంటూ సాంప్రదాయ క్రీడలను నిర్వహించుకోవాలని ప్రజలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో బాపట్ల, చీరాల, రేపల్లె, సీసీఎస్, ఏ.ఆర్ డిఎస్పీలు, జిల్లాలోని సిఐలు, ఎస్.ఐలు, మహిళా పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.