సైబరాబాద్ లో “అరైవ్ అలైవ్” క్యాంపెయిన్.

భారత్ న్యూస్ డిజిటల్ :హైదరాబాద్:

సైబరాబాద్ లో “అరైవ్ అలైవ్” క్యాంపెయిన్

తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “అరైవ్ అలైవ్” రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్‌ ను ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లోని అన్ని లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించారు.

ఈ క్యాంపెయిన్ జనవరి 13 నుంచి 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగనుంది. రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.

మాదాపూర్ లోని మైండ్‌స్పేస్ లో నిర్వహించిన కార్యక్రమంలో మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ సాయి మనోహర్ మాట్లాడుతూ.. మీరు సురక్షితంగా ఇంటికి చేరితే మీ కుటుంబం సంతోషంగా ఉంటుందని, అదే “అరైవ్ అలైవ్” ముఖ్య ఉద్దేశమని గుర్తు చేశారు. ఎక్కువగా మానవ తప్పిదాల కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, మొబైల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వంటి కారణాల వల్ల అనేక కుటుంబాలు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.

ప్రతీ వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్, సీట్‌ బెల్ట్ ను ధరించడం, వేగ పరిమితులను పాటించడం వంటి ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తే ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చని స్పష్టం చేశారు.