భారత్ న్యూస్ డిజిటల్:హైదరాబాద్:
తెలుగు సంక్రాంతి వచ్చింది – సిరులెన్నో తెచ్చింది
పండుగ వేళ – పల్లెలు కళ కళ
పల్లెలు కళకళలాడుతున్నాయి. కొత్త అల్లుళ్లు, ఆడపడుచులు, చుట్టాలు, మిత్రుల రాకతో గ్రామాల్లో సంక్రాంతి కళ నెలకొంది. వ్యాపారాలు, ఉద్యోగాల కోసం పట్నంబాట పట్టిన వారు తిరిగి స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. ప్రజలంతా అయినవారి మధ్య పండగ జరుపుకుంటుండంతో పల్లెలన్నీ కోలాహలంగా మారాయి. మూడు రోజుల పాటు సందడిగా సాగననున్న సంక్రాంతి సంబరాల్లో రంగవల్లులు, భోగి మంటలతో భోగిపండుకు స్వాగతం పలికిన తెలుగువారు.. అదే సందడితో సంక్రాంతికి స్వాగతం పలుకుతున్నారు. అలాగే మకర సంక్రాంతికి స్వాగతం పలుకుతూ పక్షం రోజులుగా గంగిరెద్దులు పల్లెల్లో సందడి చేస్తున్నాయి. ధనుర్మాసం కావడంతో ఉదయమే చేతిలో చెక్కలు, నుదుట నామాలు, మెడలో పూలదండలతో హరిదాసుల సంకీర్తనలు వినిపిస్తున్నాయి. మకర సంక్రాంతి, కనుమ పండుగల నేపథ్యంలో సంబరాలు అంబరాన్నంటన్నాయి.
తెలుగు సంస్కృతి వివిధ రూపాల్లో ప్రత్యక్షమయ్యే గొప్ప శుభవేళ సంక్రాంతి. ఈ పండుగ అంటే…… చల్లని గాలుల నడుమ, పచ్చని పైరుల నడుమ, ప్రతీ ఊరు, ప్రతీ ఇల్లు ధాన్యపు రాశులతో, డూ డూ బసవన్నల నృత్యాలు, గంగిరెద్దు వాళ్ళ విన్యాసాలు, ఉషోదయాన్నే హరిదాసు చేసే గజ్జెల చప్పుళ్ళు, భం భం అనే జంగర దేవరలు, హంగామాతో హాస్యన్ని పండించే పగటి వేషగాళ్ళు ముచ్చటగొల్పుతున్నాయి. మా ఇంటికి రండీ అని స్వాగతించే గొబ్బెమ్మల చుట్టూ నృత్యం చేస్తున్న అమ్మాయిలు, గాలి పటాలతో సందడి చేసే పిల్లలు, ముంగిట్లో ఇంద్ర ధనస్సును నిలిపే రంగవల్లులు పందెం రాయుళ్ళ పౌరుషానికి పదును పెడుతూ వేసే కోడి పందాలు, చిట్టి పొట్టి పాపల బుడి బుడి అడుగులు, కొత్తగా పెళ్ళైన జంటలు సందడి చేస్తున్నాయి. ఇలా అందరి సమక్షంలో బొమ్మల కొలువులతో, భోగి మంటల చాటున చల్లని ఉదయాన్ని ఆస్వాదిస్తూ, పాత వస్తువులను, కష్టాలను, భోగి మంటలకు సమర్పిస్తూ, చిన్నారులకు భోగి పళ్ళు పోస్తూ, అందరూ సంక్రాంతి సంబరాల్లో మునిగితేలారు.
‘వచ్చింది, వచ్చింది, సంక్రాంతి- తెచ్చింది, తెచ్చింది నవకాంతి, ముత్యాల ముగ్గుల్లు ముంగిళ్ళు నిండాయి – ముగ్గుల్లో గొబ్బిళ్ళు ముచ్చట్లు గొలిపాయి’ అంటూ సంక్రాంతిని గొప్పగా వర్ణించవచ్చు. తెలుగువారు ఉత్సాహంగా, ఉల్లాసంగా, సరస విన్యాసాలతో జరుపుకొనే సజీవ చైతన్యమే ఈ సంక్రాంతి. అన్నదాతలైన రైతులు కష్టపడి చేసిన వ్యవసాయ ఫలితం ధాన్యలక్ష్మి రూపంలో ఇళ్ళకు చేరి నట్టింట కొలువుదీరే పండుగ. ఆనందాన్ని మనసునిండా నింపుకొని, అనురాగబంధాల మధ్య ఎంతో శ్రద్ధగా ఈ పండుగ జరుపుకొంటారు. అసలు సంక్రాంతి పండుగకు ఎంతో ప్రత్యేకత ఉంది. సూర్యుడు ధనుస్సురాశిలో ప్రవేశించిన నాటినుంచి ధనుర్మాసం మొదలవుతుంది. ఇది 30 రోజుల సంబురం.
ఈ చలికాలంలో మగువలు ఉదయాన్నే లేచి రంగవల్లులు తీర్చిదిద్దుతారు. స్త్రీలు వేకువజామున బ్రహ్మీముహూర్తంలో నిద్రలేచి ఆవుపేడతో వాకిలి కళ్ళాపి జల్లి ముగ్గులు తీర్చిదిద్దేందుకు తయారుచేస్తారు. చక్కటి ముగ్గులో కళాత్మకంగా రంగులద్ది కొత్త సొబగులు తెస్తారు. ముగ్గుల మధ్య ఆవుపేడతో గొబ్బెమ్మలు చేసి పసుపురంగు పూలతో అలంకరిస్తారు.

గుమ్మడి పూలు, తంగేడు పూలతొ అలంకరించిన గొబ్బెమ్మలు ముంగిళ్ళను కొత్త అందాలతో నింపుతాయి. ఈ ముగ్గు చుట్టూ మగువలు, బాలికలు లయబద్ధంగా అడుగులు వేస్తూ గొబ్బి తట్టుతారు. అంతేకాక హరిదాసు రాక, జంగమయ్య దీవెనలు, బుడబుక్కలవాని ఢమరుక నాదం, గంగిరెద్దుల ఆట ఈ పండుగ సందడిలో ఒక భాగం. హరిదాసు అలంకరణ ఒక ప్రత్యేకత. నుదుటన తిరుచూర్ణం, చేతిలో చిడుతలు, తలమీద గుమ్మడికాయ ఆకారంలో వున్న పాత్ర, తంబుర నాదంతో ‘హరిలో రంగ హరీ’ అంటూ చేసే సందడి కొత్త కళను తెస్తుంది.
అంబపలుకు, జగదంబపలుకు అంటూ బుడబుక్కల వాని పలుకులు వేకువజాముని జాగృతిని చేస్తాయి. జంగమయ్య దీవెనలతో వీధులన్నీ మార్మోగుతాయి. పతంగాలు ఎగురవేసి పిల్లలు, పెద్దలు చేసే సందడి ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకం. రంగు రంగుల గాలిపటాలను, మాంజాలను తయారు చేయడం, పోటా పోటీగా గాలిపటాలను ఎగురవేయడంతో పిల్లలకు ఉత్సాహమే, ఉల్లాసమే. ఇలా ఎంతో ఆనందంగా గడిచిపోయే ఈ పండుగ రోజులను ఎలా గడుపుతున్నారో కొందరి అభిప్రాయాలను అడిగి తెలుసుకుందాం. వారి మాటల్లోనే….
పల్లెల్లో గడపడం మరచిపోలేని అనుభూతి
– బుద్ధారం రమేశ్, వనపర్తి
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు. ప్రతి ఒక్కరి మనసు ఎగిరి గెంతులేస్తుంది. ఎందుకంటే యాంత్రిక జీవితంలో అలసిసొలసి పోయిన మనసులను కాస్త రిలాక్స్ దొరుకుతుంది. ఆంగ్ల సంవత్సరం ఆరంభం తరువాత వచ్చే మొదటి పండుగ కాబట్టీ ఒకరినొకరు కలుసుకుని ఆత్మీయతను పంచుకోవడానికి ఈ పర్వదినం ఎంతో దోహదపడుతుంది. సుదూర ప్రాంతాల నుంచి పండుగను జరుపుకోవడానికి ప్రత్యేకంగా స్వంత ఉళ్లకు రావడంతో నేటికీ పల్లెలన్నీఅనురాగంతో కళకళలాడుతుండటం మరచిపోలేని అనుభూతి. పల్లెల్లో పండుగ చేసుకోవడం మరచిపోలేని అనుభూతి
నూతన కాంతితో పల్లె సీమలు కళ కళ
- వారణాసి సుధాకర్ చారి, పామాపురం గ్రామం, కొత్తకోట మండలం
అసలు సంక్రాంతి అంటే…అందమైన, ఆనందమైన జీవితాలలో తొలి కాంతి. పంట చేతికొచ్చిన ఆనందంలో రైతన్నల కళ్ళల్లో విరిసే కోటి కాంతులతో, అనందాల కోలాహలంతో, ఈ పండుగను మూడు రోజులుగా చేసుకోవడం ఎప్పటినుంచో వస్తున్న ఆచారం మనకు తెలిసిందే. ప్రతి ఇంటా ముగింట్లో ముగ్గుల్లో గొబ్బిళ్ళు ముచ్చట్లు గొలుపుతాయి. ఈ ముగ్గు చుట్టూ మగువలు, బాలికలు లయబద్ధంగా అడుగులు వేస్తూ గొబ్బి తట్టడం ప్రత్యేక ఆకర్షణ గొల్పుతుంది. వంటలు, పిండివంటలను ఒకరికొకరు పంచుకొని తింటూ సరదాగా గడపడం పల్లెల్లో భలే సరదాగా ఉంటుంది.
**