కాజీపేటలో 58వ సీనియర్ జాతీయ ఖో-ఖో ఛాంపియన్‌షిప్ ఘనంగా ప్రారంభం

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా,కాజీపేటలో 58వ సీనియర్ జాతీయ ఖో-ఖో ఛాంపియన్‌షిప్ ఘనంగా ప్రారంభం
బ్యూరో చీఫ్ వరంగల్ జనవరి 11
హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే స్టేడియంలో ఆదివారం 58వ సీనియర్ జాతీయ ఖో-ఖో ఛాంపియన్‌షిప్ (మెన్, విమెన్) పోటీలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా ఖో-ఖో క్రీడాకారులు, క్రీడాభిమానులు భారీ సంఖ్యలో హాజరై ఈ జాతీయ స్థాయి క్రీడా పండుగకు ఘనత చేకూర్చారు.ఈ పోటీల ప్రారంభోత్సవా నికి రాష్ట్ర పౌరసరఫరాలు, సాగునీటి పారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఖో-ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సుధాంశ్ మిట్టల్, రాష్ట్ర ఖో-ఖో అసోసియేషన్ అధ్యక్షుడు జంగా రాఘవ రెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. వీరందరూ కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను అధికారికంగా ప్రారంభించారు.జాతీయ స్థాయి పోటీలకు వరంగల్ ఆతిథ్యం గర్వకారణం ఉత్తమ్ కుమార్ రెడ్డి
ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, చారిత్రక వరంగల్ నగరంలో జాతీయ స్థాయి ఖో-ఖో పోటీలను నిర్వహించడం గర్వకారణమని అన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఈ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున హృదయపూ ర్వక స్వాగతం పలికారుఈ ఛాంపియన్‌ షిప్‌లో దేశవ్యాప్తంగా 79 జట్లు పాల్గొంటుండగా, సుమారు 1400 మంది క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారని తెలిపారు. క్రీడాకారులకు వసతి, భోజనం, రవాణా, వైద్య సదుపాయాలు సహా అన్ని అవసరమైన సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిందన్నారు.
కబడ్డీ, ఖో-ఖో వంటి సంప్రదాయ భారతీయ క్రీడలు గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రాచుర్యం పొందాయని, యువతలో శారీరక దృఢత్వం, క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ఇతర క్రీడలతో పాటు ఈ దేశీయ క్రీడలను కూడా ప్రభుత్వం సమానంగా ప్రోత్సహిస్తుందని స్పష్టం చేశారు.వరంగల్ జిల్లా చారిత్రక వారసత్వానికి మాత్రమే కాకుండా క్రీడా రంగంలోనూ మంచి గుర్తింపు కలిగిన ప్రాంతమని, ఇక్కడ అనేక మంది ప్రతిభావంతమైన క్రీడాకారులు దేశానికి సేవలందిస్తున్నారని మంత్రి గుర్తు చేశారు.ఖో-ఖోకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలి – వాకిటి శ్రీహరి
ఈ సందర్భంగా రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, క్రీడల ద్వారా దేశానికి అంతర్జాతీయ స్థాయిలో గౌరవం తీసుకురావాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో పుట్టిన విశ్వ క్రీడగా ఖో-ఖో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాలన్నారు.ఖో-ఖోతో పాటు ఇతర క్రీడల అభివృద్ధి కోసం మౌలిక వసతులు మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. జే.ఎం.ఎస్‌లోని ఇండోర్ స్టేడియం అభివృద్ధి, ఖో-ఖో సహా ఇతర క్రీడల ప్రోత్సాహం కోసం రూ. కోటిన్నర నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
ఖో-ఖో అభివృద్ధికి సంఘాల కృషి
ఖో-ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సుధాంశ్ మిట్టల్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఖో-ఖో క్రీడకు ఆదరణ పెరుగుతోందని, ఇలాంటి జాతీయ స్థాయి పోటీలు క్రీడాకారుల ప్రతిభను వెలికి తీస్తాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఖో-ఖో అభివృద్ధిలో ముందంజలో ఉందని ప్రశంసించారు.
రాష్ట్ర ఖో-ఖో అసోసియేషన్ అధ్యక్షుడు జంగా రాఘవ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే ఈ స్థాయిలో జాతీయ పోటీలనునిర్వహించగ లుగుతున్నామని తెలిపారు.
భారీగా హాజరైన క్రీడాభిమానులు
ప్రారంభోత్సవ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో క్రీడాభిమానులు, విద్యార్థులు, యువత హాజరై క్రీడాకారులను ఉత్సాహపరిచారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన జట్లు తమ తొలి పోటీల్లోనే హోరాహోరీగా తలపడుతూ ఛాంపియన్‌షిప్‌కు ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి.మొత్తంగా, కాజీపేట వేదికగా ప్రారంభమైన 58వ సీనియర్ జాతీయ ఖో-ఖో ఛాంపియన్‌షిప్ తెలంగాణ రాష్ట్రానికి, వరంగల్ జిల్లాకు క్రీడా రంగంలో మరో ప్రతిష్టాత్మక గుర్తింపుగా నిలుస్తోంది.