మ‌హిళా ఐఏఎస్ ఆఫీస‌ర్ల‌పై మీడియా ప్ర‌సారాలు ఆక్షేప‌ణీయం.

.భారత్ న్యూస్ హైదరాబాద్….మ‌హిళా ఐఏఎస్ ఆఫీస‌ర్ల‌పై మీడియా ప్ర‌సారాలు ఆక్షేప‌ణీయం

టీవీ ఛానెల్ తీరును తీవ్రంగా ఖండించిన తెలంగాణ ఐఎఫ్ఎస్ అధికారుల సంఘం

తెలంగాణ రాష్ట్ర ప్ర‌జా సంక్షేమం కోసం నిరంత‌రం శ్ర‌మిస్తున్న మహిళా ఐఏఎస్ ఆఫీస‌ర్ల‌పై తప్పుడు ప్ర‌సారాలు చేసిన ఒక ప్రముఖ‌ టీవీ ఛానెల్ ప్ర‌సార తీరుతెన్నుల‌ను తెలంగాణ ఐఎఫ్‌ఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలు పూర్తిగా అసత్యమని, బాధ్యతలేని, అనైతికమైనవని సంఘం పేర్కొంది. ఈ మేర‌కు శనివారం ఆ సంఘం కార్యదర్శి, సీనియర్ ఐఎఫ్‌ఎస్ అధికారి ప్రియాంక వర్గీస్ మీడియాకు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఆ ప్ర‌సారంలో వాస్త‌వం లేద‌ని, ప‌రువు నష్టం కలిగించే విషయాలు ఉన్నాయని సంఘం వెల్ల‌డించింది. ప్రజల కోసం సేవ చేస్తున్న మహిళా అధికారుల గౌరవం, గోప్యత, వృత్తిపరమైన ప్రతిష్ఠను పూర్తిగా అవమానించినట్టుగా ఈ ప్రసారం ఉందని అభిప్రాయ‌ప‌డింది. అధికారుల పోస్టింగ్‌లు, వ్యక్తిగత విషయాలపై చేసిన అన్ని ఆరోపణలను సంఘం పూర్తిగా తిరస్కరించింది. ఇటువంటి బాధ్యతలేని ప్రసారాలు నిజాయితీగా పనిచేస్తున్న అధికారుల ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని… సంస్థలపై ప్రజల నమ్మకాన్ని తగ్గిస్తాయని పేర్కొంది. సంబంధిత ఛానళ్ళు వెంటనే బహిరంగంగా, షరతుల్లేని క్షమాపణ చెప్పాలని సంఘం డిమాండ్ చేసింది. అభ్యంతరకరమైన ఈ కంటెంట్‌ను అన్ని మీడియా, డిజిటల్ వేదికల నుంచి తక్షణమే తొలగించాలని కోరింది. మహిళా అధికారులను లక్ష్యంగా చేసుకుని వారి గౌరవంపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తెలంగాణ ఐఎఫ్‌ఎస్ అధికారుల సంఘం స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి దుష్ప్రచారాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్ప‌ష్టం చేసింది….