పల్నాడు ఆర్టీసీ బస్సులో షాకింగ్ ఘటన.. ఫోన్‌పే మోసం బట్టబయలవడంతో రన్నింగ్ బస్సు నుంచి దూకి యువకుడు మృతి

భారత్ న్యూస్ విజయవాడ…పల్నాడు ఆర్టీసీ బస్సులో షాకింగ్ ఘటన.. ఫోన్‌పే మోసం బట్టబయలవడంతో రన్నింగ్ బస్సు నుంచి దూకి యువకుడు మృతి పల్నాడు పల్నాడు జిల్లాకు చెందిన APSRTC బస్సులో జరిగిన ఘటన ఒంగోలు సమీపంలో జాతీయ రహదారిపై తీవ్ర కలకలం రేపింది. చిలకలూరిపేట నుంచి ఒంగోలు వైపుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ యువకుడు రన్నింగ్‌లో ఉన్న బస్సు నుంచి ఒక్కసారిగా బయటకు దూకి తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి: మేదరమెట్ల వద్ద గోపీనాధ్ అనే యువకుడు బస్సు ఎక్కాడు. ప్రయాణ సమయంలో తనకు అత్యవసరంగా రూ.200 ఫోన్‌పే కావాలంటూ బస్సులోని ప్రయాణీకులను ప్రాధేయపడ్డాడు. చివరకు మురళీకృష్ణ అనే ప్రయాణీకుడు అంగీకరించి గోపీనాధ్ ఫోన్‌పే ఖాతాకు రూ.200 పంపించాడు. అందుకు గోపీనాధ్ నగదుగా రూ.200 ఇచ్చాడు. అనంతరం తన ఫోన్ డెడ్ అయిందని చెప్పి, అత్యవసర కాల్ చేయాల్సి ఉందంటూ మురళీకృష్ణ ఫోన్ తీసుకున్నాడు. కాల్ మాట్లాడుతున్నట్టు నటిస్తూ, ముందుగా గమనించిన ఫోన్‌పే పాస్‌వర్డ్‌ను ఉపయోగించి మురళీకృష్ణ ఫోన్‌పే నుంచి మరో నంబర్‌కు రూ.90,000 నగదును బదిలీ చేశాడు. కొద్దిసేపటికి అనుమానం వచ్చిన మురళీకృష్ణ తన ఫోన్ తిరిగి తీసుకుని పరిశీలించగా, ఫోన్‌పే ద్వారా భారీ మొత్తంలో డబ్బు ట్రాన్స్‌ఫర్ అయిన విషయం వెలుగులోకి వచ్చింది. గోపీనాధ్‌ను నిలదీయడంతో తన మోసం బయటపడినట్టు గ్రహించిన అతడు భయంతో రన్నింగ్‌లో ఉన్న బస్సు కిటికీ నుంచి బయటకు దూకేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన గోపీనాధ్‌ను హుటాహుటిన ఒంగోలు జీజీహెచ్కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.