..భారత్ న్యూస్ హైదరాబాద్….వైరల్ అవ్వడానికి వివాదాలు !
సోషల్ మీడియాలో ఫేమస్ అవడానికి అడ్డదారులు తొక్కుతున్నారు కొంత మంది సోకాల్డ్ సెలబ్రిటీలు. వీరి వ్యవహారం రాను రాను ముదిరిపోతోంది. పోలీసు కేసులు పెడితే అదే తాము కోరుకున్నామని మరింతగా రెచ్చిపోతున్నారు. మరీ ఇరుక్కుపోతామనుకుంటే ఓ క్షమాపణ చెప్పి మళ్లీ సర్దుకుంటున్నారు. ఇలాంటి సెలబ్రిటీలు పెరిగిపోతున్నారు. వీరి బారిన పడి అనేక మంది దేవుళ్లు, దేశ నాయకులు కూడా ఇబ్బంది పడుతున్నారు.
సాయిబాబా గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిన మాధవీలత
సినిమాల్లేక సోషల్ మీడియాలో వివాదాస్పద చర్చలు జరిపే నటి మాధవీలత..తాజాగా షిరిడి సాయిబాబాపై వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆప్ఘాన్ ముస్లిమట. మనం ఎందుకు ఆయనను పూజించాలట. హిందూ దేవతలు కలలోకి రారు కానీ సాయిబాబా వస్తారట. ఆ సాయిబాబాను ముస్లింలే పూజించరు.. హిందువులెందుకు పూజించాడని ఆమె ప్రశ్న. ఆమె ఇలాంటి వ్యాఖ్యలతో వైరల్ కావాలనుకున్నారు. పోలీసులు కూడా సాయం చేశారు. ఆమె ఇలా మాట్లాడారని ఫిర్యాదు వస్తే కేసు నమోదు చేశారు. నోటీసులు జారీ చేశారు. ఆమెకు కావాల్సింది ఇదే. పోలీసుల ముందు హాజరైతే మరింత పబ్లిసిటీ.. మరింత మీడియా కవరేజ్. గత ఏడాది ఇదే సమయంలో తాడిపత్రి లో నూతన సంవత్సర వేడుకలతో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి..జేసీ ప్రభాకర్ రెడ్డితో గొడవ పెట్టుకుని వివాదంతో సంబంధం లేని హైదరాబాద్ స్టేషన్ల చుట్టూ తిరిగి కొన్ని రోజులు హైలెట్ అయ్యే ప్రయత్నం చేశారు.
అన్వేష్ది మరో గోల !
నా అన్వేషణ పేరుతో యూట్యూబ్ చానల్ నడుపుతూ… దేశాలన్నీ చూపించే అన్వేష్ది మరో గోల. ఆయన వ్యూస్ కోసం ఎప్పటికప్పుడు ఏదోక వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. మొదట్లో ఏపీ రాజకీయాలపై మాట్లాడారు. తర్వాత బెట్టింగ్ యాప్స్ లో ఇతర యూట్యూబర్లను టార్గెట్ చేశారు. ఇప్పుడు తాజాగా హిందూ దేవుళ్లపై పడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలతో చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. తన వాదన వినిపించుకుంటూ మరిన్ని వ్యూస్ తెచ్చుకుంటున్నారు. అది ఆయన గేమ్ ప్లాన్. అయితే తన పాపులారిటీ కోసం.. నిలబెట్టుకోవడం కోసం ఇలా దేవుళ్లను టార్గెట్ చేయడానికి వెనుకాడకపోవడం ఆయన ప్లాన్.
ఇలా ఎందరో ?

సోషల్ మీడియాలో ఇలా ఒకరిని తిట్టి పాపులారిటీ సంపాదించుకున్నవారే అంతా. యూట్యూబర్ల పేరుతో ఏ మాత్రం బుర్ర లేకుండా మాట్లాడటం.. కేసులు అయితేనే పెద్ద అడ్వాంటేజ్ అన్నట్లుగా రెచ్చిపోవడం.. న్యూట్రల్ ముసుగులో ఓ పార్టీని డబ్బుల కోసం మోయడం వంటివి చేస్తూ వస్తున్నారు. ఇలాంటి వారు చేసే కామెంట్లపై స్పందించడం వల్ల వారు చేసిన మాటలకు మరింత పాపులారిటీ కల్పించినట్లవుతుంది. ఇలాంటి వారిని పట్టించుకోకుండా వదిలేయడం ద్వారా వారు ప్లాన్ ఫలించలేదని నిరూపించాలి కానీ.., మరింత పాపులర్ చేస్తే మరింత ఘోరమైన వ్యాఖ్యలు చేస్తారు.