వార్షిక తనిఖీల్లో భాగంగా చీరాల రూరల్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు

భారత్ న్యూస్ డిజిటల్:బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం:

వార్షిక తనిఖీల్లో భాగంగా చీరాల రూరల్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం

రోడ్డు ప్రమాదాలను తగ్గించడంపై ప్రత్యేక దృష్టి

జాతీయ రహదారులపై 9 రోడ్ సేఫ్టీ స్పెషల్ స్క్వాడ్ల ఏర్పాటు

  • జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు*

రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు జాతీయ రహదారులపై 9 రోడ్ సేఫ్టీ స్పెషల్ స్క్వాడ్లను ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శనివారం జిల్లా ఎస్పీ గారు చీరాల రూరల్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు.

సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించి, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. గ్రామ సచివాలయ మహిళా పోలీసులతో ప్రత్యేకంగా సమావేశమై వారు నిర్వహిస్తున్న విధుల గురించి ఆరా తీశారు. మహిళా పోలీసులు తమ గ్రామ సచివాలయాల పరిధిలో జరుగుతున్న చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాల గురించి సమాచారం తెలుసుకొని సంబంధిత స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకు తెలియజేయాలని సూచించారు. రౌడీ షీటర్లు, చెడు నడత కలిగిన వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు.

స్టేషన్ పరిధిలోని సముద్ర తీర ప్రాంతాల్లో, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై చర్యలు తీసుకోవాలని, పర్యాటకులు కుటుంబంతో కలిసి ప్రశాంతంగా గడిపే వాతావరణం కల్పించాలని అధికారులకు తెలిపారు. వారాంతాలు, సెలవు దినాల్లో వాడరేవు, రామాపురం బీచ్ సముద్ర తీరాలకు యాత్రికులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఆ ప్రాంతాల్లో పెట్రోలింగ్ ముమ్మరంగా నిర్వహించాలని ఆదేశించారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి విచారణ దశలో ఉన్న కేసులను వేగవంతంగా దర్యాప్తు చేసి, సంబంధిత కోర్టుల్లో అభియోగపత్రాలు దాఖలు చేయాలన్నారు. నైట్ పెట్రోలింగ్‌ను సమర్థవంతంగా నిర్వహించి దొంగతనాలు తదితర ప్రాపర్టీ నేరాలను కట్టడి చేయాలన్నారు. రౌడీలు, పాత నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచి, వారు మరల ఇటువంటి నేరాలకు పాల్పడకుండా కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. గతంలో నేరాలకు పాల్పడిన వ్యక్తులు మళ్లీ ఏదైనా నేరానికి పాల్పడితే సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, వార్షిక తనిఖీల్లో భాగంగా చీరాల రూరల్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించడం జరిగిందన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న నేరాలపై సమీక్ష నిర్వహించామన్నారు. ఈ ప్రాంతంలో నేరాలను నిరోధించేందుకు, దొంగతనాలు వంటి ప్రాపర్టీ నేరాలను కట్టడి చేయడానికి, దొంగిలించబడిన సొమ్మును రికవరీ చేసేందుకు తీసుకోవలసిన చర్యలపై దిశానిర్దేశం చేయడం జరిగిందన్నారు.

ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలైన గంజాయి కట్టడి, మహిళల పట్ల జరిగే నేరాలను అరికట్టడం, సైబర్ నేరాలను నిరోదించడం, కేసుల దర్యాప్తు తదితర విషయాలలో పోలీస్ స్టేషన్ పనితీరును (పర్ఫార్మెన్స్) సమీక్షించడం జరిగిందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, డీజీపీ గారు ఇటీవల నిర్వహించిన కలెక్టర్ ఎస్పీల సమావేశంలో సూచించిన ప్రధాన అంశం రోడ్డు ప్రమాదాలేనని తెలిపారు.

జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు NH-16, NH-216 తదితర జాతీయ రహదారులపై 9 రోడ్ సేఫ్టీ స్పెషల్ స్క్వాడ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ స్పెషల్ స్క్వాడ్లలో స్థానిక పోలీసులతో పాటు హైవే, టోల్ ప్లాజా, ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది కలిసి బృందాలుగా పనిచేస్తూ, జాతీయ రహదారులపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఎన్ఫోర్స్‌మెంట్ చర్యలు కూడా చేపడుతున్నారని తెలిపారు.

ప్రజలకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించడంతో పాటు వాటిని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో ప్రధానంగా మూడు జాతీయ రహదారులపై తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను బ్లాక్ స్పాట్స్‌గా గుర్తించడం జరిగిందన్నారు. వీటితో పాటు ప్రమాదాలు జరగే అవకాశం ఉన్న ఇతర రహదారులను కూడా గుర్తించడం జరిగిందన్నారు. మొత్తం 84 ప్రదేశాల్లో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని గుర్తించగా, అందులో 15 బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించామని తెలిపారు. వీటిపై ఇంజనీరింగ్ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించామన్నారు.

జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ప్రధానంగా ఆరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా జరుగుతున్నాయని, వాటిపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రదేశాల్లో స్పీడ్ బ్రేకర్లు, రంబుల్ స్ట్రిప్స్, రోడ్ మార్కింగ్స్ ఏర్పాటు చేయడంతో పాటు, ముఖ్యంగా జాతీయ రహదారులపై హెల్మెట్ లేకుండా ఎవరూ ప్రయాణం చేయకుండా గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో హెల్మెట్‌పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నామన్నారు.

ముఖ్యంగా రాత్రి వేళల్లో, వేకువజాము సమయాలలో నిద్రమత్తులో వాహనాలు నడపడం వలన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటిని నివారించేందుకు ‘స్టాప్ ఫేస్ వాష్ గో’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత నుంచి జిల్లాలో గత నెలన్నర కాలంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టి, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, భారీ వాహనాలను తనిఖీ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 2700కు పైగా బస్సులను తనిఖీ చేయడం జరిగిందన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్‌ను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ఈ తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని అదుపులోకి తీసుకుని, వారిపై మరియు సంబంధిత ట్రావెల్స్ సంస్థలపై కేసులు నమోదు చెయ్యడం జరిగిందన్నారు. జిల్లాలో రౌడీ కార్యకలాపాలకు తావు లేదని, ఎవరైనా రౌడీయిజం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత కొంతకాలంగా రౌడీ షీటర్లు, చెడు నడత కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. వారి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ, వారు మళ్లీ నేరాలకు పాల్పడకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తరచూ నేరాలకు పాల్పడే వారిపై పీడీ చట్టం ఉపయోగించి జిల్లా భహిష్కరించడిని కూడా వెనుకాడబోమని జిల్లా ఎస్పీ గారు హెచ్చరించారు. రాబోయే రోజుల్లో జిల్లాలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా కఠిన చర్యలు చేపట్టనున్నామని తెలిపారు.