సంక్రాంతి రద్దీకి ఊరట.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే.

భారత్ న్యూస్ రాజమండ్రి…సంక్రాంతి రద్దీకి ఊరట.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే

కాకినాడ, నాందేడ్, మచిలీపట్నం నుంచి రైళ్లు

జనవరి 11వ తేదీ నుంచి అందుబాటులోకి

సౌకర్యాన్ని వినియోగించుకోవాలన్న దక్షిణ మధ్య రైల్వే

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం కాకినాడ, సికింద్రాబాద్ మీదుగా వికారాబాద్, నాందేడ్ మార్గాలలో, అలాగే మచిలీపట్నం మార్గంలో మొత్తం ఆరు ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే నిర్ణయించింది. ఈ ప్రత్యేక సర్వీసులలో రెండు రైళ్లు కాకినాడ నుంచి సికింద్రాబాద్ మీదుగా వికారాబాద్ వరకు నడుస్తాయి. మరో రెండు రైళ్లు నాందేడ్ – కాకినాడ మార్గంలో, మిగిలిన రెండు రైళ్లు మచిలీపట్నం – వికారాబాద్ మధ్య సేవలు అందిస్తాయి.

కాకినాడ – వికారాబాద్ రైలు (07450): ఇది జనవరి 19న కాకినాడ నుంచి సాయంత్రం 4:45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది.

వికారాబాద్ – కాకినాడ రైలు (07451): ఈ రైలు జనవరి 20న వికారాబాద్ నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి రాత్రి 9:15 గంటలకు కాకినాడకు చేరుకుంటుంది.

నాందేడ్ – కాకినాడ రైలు (07452): ఇది జనవరి 12న మధ్యాహ్నం 1:30 గంటలకు నాందేడ్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు కాకినాడ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో (07453) రైలు జనవరి 13న కాకినాడలో మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు నాందేడ్‌కు చేరుకుంటుంది.

మచిలీపట్నం – వికారాబాద్ రైలు (07454): ఈ రైలు జనవరి 11, 18 తేదీల్లో ఉదయం 10 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు రాత్రి ఎనిమిది గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది.

వికారాబాద్ – మచిలీపట్నం రైలు (07455): జనవరి 11, 18 తేదీల్లో రాత్రి 10 గంటలకు వికారాబాద్ నుంచి బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 8:15 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లలో టికెట్ బుకింగ్ చేసుకుని ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు సూచించింది.