వార్షిక తనిఖీల్లో భాగంగా రేపల్లె పట్టణ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు

భారత్ న్యూస్ డిజిటల్:బాపట్ల జిల్లా:

వార్షిక తనిఖీల్లో భాగంగా రేపల్లె పట్టణ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు

సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి

రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలి

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే జిల్లా బహిష్కరణ విధిస్తాం

ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి

జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు

రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని, చట్ట వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే జిల్లా బహిష్కరణ విధించడానికి కూడా వెనుకాడబోమని జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు హెచ్చరించారు.

వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం ఆయన రేపల్లె పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ముందుగా పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీజీ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి గౌరవ వందనం సమర్పించారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించి, ఎస్‌హెచ్‌ఓ గది, రైటర్ గది, కంప్యూటర్ విభాగం, కేస్ ప్రాపర్టీ భద్రపరిచిన గదిని తనిఖీ చేశారు.

రిసెప్షన్ కౌంటర్ ను పరిశీలించారు, వివిధ సమస్యల పరిష్కారం కోసం స్టేషన్కు వచ్చే ఫిర్యాదు దారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి సమస్యలను తెలుసుకోవాలన్నారు. ఫిర్యాదుదారులు ఇచ్చే అర్జీలను స్వీకరించి సక్రమంగా రిసెప్షన్ రిజిస్టర్లో నమోదు చేస్తున్నారా లేదా అనేదానిపై ఆరా తీసి, రికార్డును క్షుణ్ణంగా పరిశీలించారు.

జిల్లా ఎస్పీ గారు గ్రామ/వార్డు సచివాలయ మహిళా పోలీసులు మరియు పోలీస్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వారు నిర్వహిస్తున్న విధులు, ఎదురవుతున్న శాఖాపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళా పోలీసులు అంకితభావం, నిబద్ధతతో విధులు నిర్వహించాలని సూచించారు. వార్డు పరిధిలోని సమాచారం ఎప్పటికప్పుడు సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకు అందజేయాలని తెలిపారు.

కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాలు చిన్న సమస్యలుగా అనిపించినప్పటికీ, వాటి నుంచే ఎక్కువ నేరాలు జరుగుతున్నాయని గుర్తించాలన్నారు. ఇలాంటి సమస్యలను తొలిదశలోనే గుర్తించి ముందస్తు చర్యలు తీసుకుంటే నేరాలను నియంత్రించవచ్చని అన్నారు. మహిళలు, చిన్న పిల్లలపై జరిగే నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, పోలీస్ సిబ్బంది తమకు కేటాయించిన వార్డులను తరచుగా సందర్శిస్తూ ఉండాలని సూచించారు. అలా చేస్తే ప్రజలు తమ సమస్యలను, గ్రామంలో జరుగుతున్న విషయాలను స్వేచ్ఛగా పంచుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

విచారణ దశలో ఉన్న కేసుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, వృత్తి నైపుణ్యాన్ని జోడించి వేగవంతంగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. త్వరితగతిన విచారణ పూర్తి చేసి సంబంధిత కోర్టులో ఛార్జ్‌షీట్లు దాఖలు చేయాలని సూచించారు. ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన కేసుల్లో సీసీ/పీఆర్‌సీ/ఎస్‌సీ నంబర్లు త్వరగా పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

పోలీస్ స్టేషన్‌లో నిర్వహిస్తున్న వివిధ క్రైమ్ రికార్డులు, సీడీ ఫైళ్లను జిల్లా ఎస్పీ గారు పరిశీలించారు. ప్రతి కేసు ఫైల్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, దర్యాప్తు పురోగతి మరియు సీసీటీఎన్‌ఎస్‌లో అప్లోడ్ చేసిన విధానాన్ని పరిశీలించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును సాంకేతిక పరిజ్ఞానంతో మరింత వేగవంతం చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, వార్షిక తనిఖీల్లో భాగంగా రేపల్లె పట్టణ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేయడం జరిగిందన్నారు. స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, వాటి దర్యాప్తు తీరు, క్రైమ్ రికార్డుల నిర్వహణను పరిశీలించామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా తీసుకోవాల్సిన అంశాలపై చర్చించి అవసరమైన సూచనలు ఇచ్చామని తెలిపారు.

జిల్లా మరియు రేపల్లె సబ్ డివిజన్ పరిధిలో రౌడీ ఎలిమెంట్స్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. వారు నేరప్రవృత్తిని విడనాడి సమాజంలో సత్ప్రవర్తనతో మెలగేందుకు కౌన్సిలింగ్‌లు నిర్వహిస్తున్నామని చెప్పారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ చట్టం ప్రయోగించి జిల్లా బహిష్కరణ విధిస్తామని హెచ్చరించారు.

ప్రతి పోలీస్ స్టేషన్‌లో తరచూ నేరాలకు పాల్పడే రౌడీ షీటర్లను గుర్తించామని, జిల్లాలోని 1027 మంది రౌడీ షీటర్లను తిరిగి బైండోవర్ చేస్తున్నామని తెలిపారు. బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలతో పాటు బాండ్ విలువను రికవరీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ చర్యల వల్ల గతంతో పోలిస్తే జిల్లాలో 20 శాతం నేరాలు తగ్గాయని చెప్పారు.

జిల్లాలో మూడు జాతీయ రహదారులు సుమారు 180 కిలోమీటర్ల మేర ఉన్నాయని, రోడ్డు ప్రమాదాలు ప్రధానంగా జాతీయ రహదారులపైనే జరుగుతున్నాయని తెలిపారు. ప్రమాదాలు తగ్గించేందుకు 9 రోడ్ సేఫ్టీ స్పెషల్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశామని, వీటిలో పోలీస్, మోటార్ వెహికల్, హైవే సిబ్బంది ఉంటారని చెప్పారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడంతో పాటు కఠిన ఎన్ఫోర్స్‌మెంట్ చేపడుతున్నామని తెలిపారు.

గంజాయి అక్రమ రవాణా, విక్రయాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని, గతంలో గంజాయి కేసుల్లో ఉన్నవారిపై నిరంతర నిఘా ఉంచుతున్నామని తెలిపారు. యువత మత్తుపదార్థాలకు బానిసలు కాకుండా “Say No to Drugs” కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తామని అన్నారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు వాహన తనిఖీలు, రైళ్లలో సోదాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రేపల్లె డీఎస్పీ ఏ. శ్రీనివాసరావు, రేపల్లె టౌన్ సీఐ ఏ.మల్లికార్జునరావు, ఎస్‌ఐ ఎస్. రాజశేఖర్, స్టేషన్ సిబ్బంది, గ్రామ/వార్డు సచివాలయ మహిళా పోలీసులు పాల్గొన్నారు.