భారత్ న్యూస్ డిజిటల్:హైదరాబాద్:
custodial death పై తీవ్ర ఆరోపణలు: విచారణకు ఆదేశించిన TGHRC
తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) SR నెం.4129 మరియు 4130 ఆఫ్ 2025 కేసుల్లో, కర్లా రాజేష్ అనే వ్యక్తి అక్రమ నిర్బంధం, కస్టడీలో చిత్రహింసలు మరియు కస్టడీ మృతికి సంబంధించిన తీవ్రమైన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుంది. ఈ ఆరోపణలను మృతుడి తల్లి శ్రీమతి కర్లా లలిత మరియు సామాజిక కార్యకర్త, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ మంద కృష్ణ మాదిగ, శ్రీ వెంకటేష్ నేత, ఫార్మర్ MP, మరియు ఇతర సామాజిక కార్యకర్తలు కమిషన్ ముందు ఉంచారు. చిల్కూర్ మరియు కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్లా రాజేష్‌ను అక్రమంగా నిర్బంధించి, థర్డ్ డిగ్రీ పద్ధతులతో హింసించి, తప్పుడు క్రిమినల్ కేసులో ఇరికించి, కుటుంబ సభ్యులను కలవనీయకుండా చేశారని, అనంతరం సబ్‌జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించినప్పటికీ తీవ్ర గాయాల కారణంగా ఆయన మృతి చెందినట్లు ఆరోపణలు ఉన్నాయని కమిషన్ గమనించింది. మానవ హక్కుల ఉల్లంఘనల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ఇదే అంశానికి సంబంధించి ముందుగా నమోదైన SR నెం.3693/2025 ఫిర్యాదుతో ఈ కేసులను కలిపి విచారణ జరపాలని నిర్ణయించి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హోం శాఖ ప్రధాన కార్యదర్శి నుండి సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను 12.01.2026కు నిర్ణయించింది.
