భారత్ డిజిటల్ న్యూస్ :కరీంనగర్:
కరీంనగర్ టౌన్ పోలీసుల ఘనత: CEIR పోర్టల్ ద్వారా 60 మొబైల్ ఫోన్ల రికవరీ
రికవరీ చేసిన ఫోన్ల విలువ సుమారు రూ. 10 లక్షలు
బాధితులకు ఫోన్లను అందజేసిన కరీంనగర్ టౌన్ ఏసీపీ
సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ, గల్లంతైన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను వెలికితీయడంలో కరీంనగర్ టౌన్ డివిజన్ పోలీసులు విశేష విజయాన్ని సాధించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు, టౌన్ ఏసీపీ గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేస్తున్న ప్రత్యేక బృందాలు CEIR (Central Equipment Identity Register) పోర్టల్ ద్వారా తాజాగా 60 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నాయి. వీటి అంచనా విలువ సుమారు రూ. 10 లక్షలు.
కరీంనగర్–I, II మరియు III టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన ఫిర్యాదులపై ప్రత్యేక బృందాలు నిరంతరం నిఘా ఉంచి, టెక్నికల్ అనాలిసిస్ ద్వారా ఈ ఫోన్లను గుర్తించాయి.
బాధితులకు అప్పగింత: రికవరీ చేసిన ఫోన్ల యజమానులను పిలిపించి, తగిన ఆధారాలను పరిశీలించిన అనంతరం వారికి మొబైల్ ఫోన్లను అందజేశారు. పోగొట్టుకున్న ఫోన్లు తిరిగి లభించడంతో బాధితులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కరీంనగర్ టౌన్ ఏసీపీ ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు.
మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నా లేదా చోరీకి గురైనా ఏమాత్రం ఆలస్యం చేయకుండా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి.
ఫిర్యాదుతో పాటు స్వయంగా లేదా పోలీసుల సాయంతో www.ceir.gov.in పోర్టల్లో మొబైల్ వివరాలను నమోదు చేయాలి. దీనివల్ల ఫోన్ దుర్వినియోగం కాకుండా బ్లాక్ చేయడంతో పాటు, తిరిగి రికవరీ చేసే అవకాశం పెరుగుతుందన్నారు.

శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల ఆస్తులను కాపాడటంలో కరీంనగర్ పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్,
కరీంనగర్ టౌన్ డివిజన్.