బాపట్ల జిల్లా పోలీసులకు ప్రతిష్టాత్మక రాష్ట్ర స్థాయి ఎబిసిడి (Award for Best Crime Detection) అవార్డు

భారత్ న్యూస్ డిజిటల్:*బాపట్ల

జిల్లా పోలీస్ ప్రధా
న కార్యాలయం:

బాపట్ల జిల్లా పోలీసులకు ప్రతిష్టాత్మక రాష్ట్ర స్థాయి ఎబిసిడి (Award for Best Crime Detection) అవార్డు

జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారిని ప్రత్యేకంగా అభినందించి అవార్డును అందజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారు

పర్యాటక శాఖకు చెందిన వెబ్‌సైట్‌లను పోలిన నకిలీ వెబ్‌సైట్‌లను రూపొందించి పర్యాటకులను మోసం చేస్తున్న కేసును సమర్థవంతంగా ఛేదించడంలో, తదనంతర దర్యాప్తును విజయవంతంగా నిర్వహించినందుకు జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారికి, అలాగే ఆ కేసును ఛేదించడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా పోలీస్ బృందానికి రాష్ట్ర పోలీస్ శాఖలో ప్రతిష్టాత్మకమైన ఎబిసిడి (Award for Best Crime Detection) అవార్డును ప్రకటించారు. ఈ అవార్డును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారి చేతులమీదుగా జిల్లా ఎస్పీ గారు మరియు సంబంధిత పోలీస్ బృందం శుక్రవారం ఆంధ్రప్రదేశ్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారిని, నకిలీ వెబ్ సైట్ లను రూపొందించే సైబర్ నేరగాళ్ళను చాకచక్యంగా అరెస్ట్ చేసిన జిల్లా పోలీస్ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2024 నుండి 2029 వరకు అమలులో ఉండే సరికొత్త టూరిజం పాలసీని తీసుకువచ్చింది. ఈ పాలసీ అమలుకు టూరిజం మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు నూతన ఉద్యోగ అవకాశాల కల్పన కోసం రూ.469 కోట్లను కేటాయించింది. ప్రభుత్వం యొక్క సంకల్పం మరియు లక్ష్యాలను దెబ్బతీసే విధంగా సైబర్ నేరగాళ్లు పర్యాటక రంగ ముసుగులో నేరాలకు పాల్పడుతూ యాత్రికులు మరియు భక్తుల నగదును దోచుకుంటున్నారు. సైబర్ నేరగాళ్లు టూరిజం శాఖకు చెందిన అధికారిక వెబ్‌సైట్‌లు మరియు ప్రఖ్యాతిగాంచిన పలు దేవస్థానాలకు చెందిన వెబ్‌సైట్‌లను పోలిన నకిలీ వెబ్‌సైట్‌లను రూపొందించి యాత్రికులు, భక్తులకు చెందిన నగదును కొల్లగొడుతున్నారు. ప్రభుత్వ టూరిజం శాఖకు చెందిన నకిలీ వెబ్‌సైట్‌లను రూపొందించి సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఈ ఘటనను తీవ్రంగా పరిగణించటం జరిగింది. ఈ కేసును ఒక సవాలుగా స్వీకరించిన పోలీసులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన సైబర్ నేరగాళ్లను అరెస్టు చేయడం జరిగింది.

బాపట్ల సూర్యలంక హరిత రిసార్ట్స్ మేనేజర్ జి. అశోక్ చేసిన ఫిర్యాదులో, “Harith Beach Resort Suryalanka” అనే నకిలీ వెబ్‌సైట్ ద్వారా పర్యాటకులను మోసం చేస్తున్నట్టు పేర్కొన్నారు. దీనిపై జూన్ 16, 2024న బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్‌లో క్రైం నంబర్ 110/2024 క్రింద IPC 420 మరియు ఐటీ యాక్ట్ 66-D సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది.

ఈ కేసులో పర్యాటక ప్రాంతాలు మరియు దేవస్థానాల పేర్లతో నకిలీ వెబ్‌సైట్‌లు సృష్టించి దేశవ్యాప్తంగా ప్రజలను మోసం చేసిన రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సూర్యలంకలోని APTDC హరిత రిసార్ట్స్‌తో పాటు తిరుమల, శ్రీశైలం, త్రయంబకేశ్వర్ దేవస్థానాల పేర్లతో నకిలీ వెబ్‌సైట్‌లు రూపొందించి మోసాలకు పాల్పడ్డారని దర్యాప్తులో తేలింది. మొత్తం 18 రాష్ట్రాల్లో 127 ఫిర్యాదుల ద్వారా సుమారు రూ.46 నుండి రూ.50 లక్షల వరకు మోసం చేసినట్లు గుర్తించారు. ఈ సైబర్ కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా, జూలై 23, 2025న రాజస్థాన్ రాష్ట్రం దిగ్ జిల్లాలో నిందితులు పరంజీత్ (20), బిట్టూ (21)లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

జిల్లా ఎస్పీ గారితో పాటు డిజిపి గారి చేతుల మీదుగా ఎబిసిడి (Award for Best Crime Detection) అవార్డు అందుకున్న పోలీస్ అధికారుల వివరాలు:

  1. జి. రామాంజనేయులు – డిఎస్పీ, బాపట్ల
  2. కె. శ్రీనివాసరావు – ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్, బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్
  3. టి. శ్రీకాంత్ – రిజర్వ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్, సైబర్ సెల్
  4. షేక్ నాయబ్ రసూల్ – (గతంలో ఎస్ఐ, బాపట్ల ఐటీ కోర్), ప్రస్తుతం సిఐ, తెనాలి రూరల్
  5. పి. సుబ్బరాజు – హెడ్ కానిస్టేబుల్, బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్
  6. వి. రమేష్ – హెడ్ కానిస్టేబుల్, బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్
  7. డి. సురేష్ – కానిస్టేబుల్, ఐటీ కోర్
  8. కె. నాగరాజు – కానిస్టేబుల్, బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్
  9. కె. బుజ్జి రాజు – కానిస్టేబుల్, బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్
  10. మహిళా కానిస్టేబుల్ డి. తబిత – ఐటీ కోర్
  11. మహిళా కానిస్టేబుల్ ఐ. కీర్తి – ఐటీ కోర్