మైనర్ బాలికను డ్రగ్స్ ఉచ్చులోకి లాగిన వారిపై కఠిన చర్యలు తప్పవు : ఈగల్ ఐజీ ఏ.కె.రవికృష్ణ

భారత్ న్యూస్ గుంటూరు….మైనర్ బాలికను డ్రగ్స్ ఉచ్చులోకి లాగిన వారిపై కఠిన చర్యలు తప్పవు : ఈగల్ ఐజీ ఏ.కె.రవికృష్ణ

గుంటూరు ::
లాలాపేట పోలీసు స్టేషన్ పరిధిలోని చిన్న బజార్ ప్రాంతంలో చోటు చేసుకున్న మైనర్ బాలికను డ్రగ్స్ మత్తు ఉచ్చులోకి లాగిన ఘటన సంచలనం రేపింది. ఈ కేసులో నిందితులపై కఠిన చర్యలు తప్పవని ఈగల్ ఐజీ ఏ.కె. రవికృష్ణ స్పష్టం చేశారు.

ఇంటర్మీడియట్ చదువుతున్న 17 ఏళ్ల బాలికను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఇద్దరు యువకులు ప్రేమ పేరుతో మాయ చేసి మాదక ద్రవ్యాలకు బానిసగా మార్చినట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లి తీవ్ర మానసిక ఆవేదనకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, కుటుంబ సభ్యులు ఆమెను గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న వెంటనే ఈగల్ ఐజీ ఏ.కె. రవికృష్ణ, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆసుపత్రికి వెళ్లి బాధితురాలి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి, చట్ట పరంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

గుంటూరు ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ “బాలిక డ్రగ్స్‌కు ఎలా అలవాటు పడింది? ఎవరు సరఫరా చేశారు? అనే కోణంలో ప్రత్యేక బృందం దర్యాప్తు చేస్తోందని, త్వరలోనే నిందితులను గుర్తించి అరెస్ట్ చేసి, కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటాం” అని అన్నారు.

గడచిన మూడు నెలల్లో 150 మందిపై మాదక ద్రవ్యాల వినియోగం కేసులు నమోదు చేశామని తెలిపారు. కళాశాలల విద్యార్థులు కూడా డ్రగ్స్ బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ, “సంకల్పం” కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తున్నామని, తాజాగా “డ్రగ్స్ వద్దు బ్రో – సైకిల్ తొక్కు బ్రో” కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించామని అన్నారు.

అధికారులు బాలికకు కౌన్సెలింగ్ నిర్వహించి, డీ-అడిక్షన్ చికిత్స ద్వారా సాధారణ స్థితికి చేరుకునేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఎస్బీ సీఐ అలహరి శ్రీనివాస్, లాలాపేట సీఐ శివ ప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు.