భారత్ న్యూస్ నెల్లూరు..ఆ నగరానికి ఏమైంది.. వరుస హత్యలు.. జైళ్ళ నుంచే సెటిల్మెంట్ల దందా.. నిన్నటికి నిన్న లేడీ డాన్ వ్యవహారం.. తాజాగా గంజాయి దందా.. అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపై కాల్పులు.. ప్రశాంత వాతావరణం కలిగిన ఆ జిల్లాలో నిత్యం హత్యలు.. గంజాయి దందాలతో అశాంతి నెలకొంది. ఆ వివరాలు ఇలా..
నెల్లూరు జిల్లాలో ఇటీవల శాంతిభద్రతలు పూర్తిగా గాడి తప్పాయా..! అన్నట్లు ఉంది తాజా పరిస్థితి. తప్పు చేసిన వారిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై దాడికి దిగుతున్న సందర్భాలు ఇటీవల చాలానే జరిగాయి. గతంలో విజయవాడ నుంచి గంజాయి దందా చేపడుతున్న ముఠాను పోలీసులు వెంబండించగా.. నెల్లూరులో పోలీసులపై దాడికి పాల్పడ్డారు. ఆ సందర్భంలో పోలీసులు కాల్పులు జరిపి ప్రాణాలు కాపాడుకోవాల్సి వచ్చింది.
నెల్లూరులో మరో లేడీ డాన్..
ఇటీవలే రౌడీ షీటర్ శ్రీకాంత్, అతని ప్రియురాలు నిడిగుంట అరుణ వ్యవహారం బయటపడింది. పెరోల్ మీద బయటకు వచ్చి వారిద్దరూ చేసిన సెటిల్మెంట్ల వ్యవహారం వెలుగు చూడగా.. లేడీ డాన్ అరుణ తాజాగా ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసింది. ఆ హంతకులను పట్టుకునేందుకు వెళ్ళిన పోలీసులకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. నెల్లూరు రూరల్ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో కె. పెంచలయ్య(38), దుర్గా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు బిడ్డలు. ఎలక్ట్రిషియన్ పనులు చేసుకుంటూ జీవనం సాగించే పెంచలయ్య.. కొన్నేళ్ల కిందట బోడిగాడితోట నుంచి హౌసింగ్ బోర్డు కాలనీకి మారారు. సమాజ స్పృహతో పాటు వామపక్ష భావజాలం ఉండే ఈయన.. సీపీఎంలో నాయకుడిగా, ఆర్డీటీ కాలనీ ముత్యాలమ్మ గ్రామాభివద్ధి కమిటీ సభ్యుడిగా ఉన్నారు. కాలనీలో కొందరు యువకులు గంజాయి తాగడం.. విచ్చలవిడిగా విక్రయాలు జరగడం గమనించి అడ్డుకున్నారు. సదరు విక్రయాలు ఓ మహిళ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని తెలిసి.. పోలీసులకు సైతం సమాచారం అందించేవారు. దీంతో ఆయనపై కక్ష పెంచుకున్న గంజాయి బ్యాచ్.. ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం సాయంత్రం పిల్లలతో స్కూటీపై ఇంటికి వెళుతుండగా.. హౌసింగ్ బోర్డు ఆర్చి వద్ద తొమ్మిది మంది గుర్తు తెలియని యువకులు పెంచలయ్యను అడ్డుకున్నారు. మాకే అడ్డు వస్తావా అంటూ ఒక్కసారిగా వారంతా కత్తులతో దాడికి పాల్పడ్డారు. బాధితుడు ప్రాణ భీతితో పారిపోతుండగా.. వెంటాడి పొడిచి మరీ పరారయ్యారు. తీవ్ర గాయాలైన పెంచలయ్యను స్థానికులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్దారించారు..

ఈ నేపథ్యంలో కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద నిందితులు ఉన్నారని సమాచారం తెలుసుకున్న పోలీసులు అరెస్ట్ చేసేందుకు వెళ్లగా పోలీసులుపై కత్తి తో దాడికి యత్నించారు. ఈ ఘటనలో ఆదినారాయణ అనే కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిందితులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో జేమ్స్ అనే నిందితుడి మోకాలికి గాయాలయ్యాయి. మరో 9 మంది నిందితులు పరారయ్యారు. పోలీసులు వాళ్ల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. నిందితుడు జేమ్స్, కానిస్టేబుల్ ఆదినారాయణకు నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. గత రెండు మూడు నెలల నుంచి ప్రశాంతంగా ఉన్న నెల్లూరులో మళ్లీ గంజాయి, రౌడీయిజం పడగ విప్పడంతో ప్రజల్లో భయాందోళన మొదలైంది. పెంచలయ్య హత్యలో కల్లూరుపల్లి ఆర్.డీ.టీ కాలనీకి చెందిన అరవ కామాక్షి హత్య చేయించినట్లు దాదాపు నిర్ధారణ అయినట్లు సమాచారం. దొంగతనాలకు పాల్పడే వ్యక్తులతో అసాంఘీక కార్యక్రమాలు చేయించడం, నేర చరిత్ర కలిగిన వ్యక్తులను ప్రొత్సహించినట్లు పోలీసులు విచారణలో గుర్తించినట్లు తెలుస్తోంది. ఇలాంటి పద్దతులు మంచిది కాదు అని మందలించినందున పెంచలయ్యను హత్య చేయించినట్లు పోలీసు విచారణలో తేలింది. స్థానిక బోడిగాని తోట వద్ద నివాసం ఉంటూ తన భర్త లారీ డ్రైవర్‌గా చుట్టుపక్కల వారికి చెబుతూ గంజాయి దందా కొనసాగించేదని తెలుస్తోంది. నిరుద్యోగులుగా ఉన్న యువతతో ఈ దందా చేయిస్తున్నట్లు తేలింది. ఇదే విషయంపై పలుమార్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చినా ఉపయోగం లేకపోగా తిరిగి ఫిర్యాదు చేసిన సమాచారాన్ని లేడీ డాన్‌కు పోలీసులు తెలియజేసే వాళ్ళని తెలుస్తోంది. తయారు చేసిన వారిని టార్గెట్ చేసి దాడులకు పాల్పడిన ఘటన కూడా అనేకం ఉన్నట్టు తెలుస్తుంది.