భారత్ న్యూస్ గుంటూరు…జాతీయ రహదారులకు భూ సేకరణ వేగవంతం చేయాలి – కలెక్టర్

Ammiraju Udaya Shankar.sharma News Editor…జాతీయ రహదారుల ప్రాజెక్టు పనులకు భూ సేకరణ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అధికారులకు పలు సూచనలు చేశారు. సోమవారం, జాతీయ రహదారుల పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ స్థానిక కలెక్టరేట్ లోని వీక్షణ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాపట్ల జిల్లా లో వెళ్లే జాతీయ రహదారులు 544జి,167ఎ,16,544డి ప్రాజెక్టు పనులను పూర్తి చేయుటకు కావలసిన భూసేకరణలో ఉండే కోర్ట్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి జాతీయ రహదారుల పురోగతిని మెరుగుపరిచే విధంగా అధికారులు పనిచేయాలని ఆయన అన్నారు. బాపట్లలో రైల్వే ట్రాక్ ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ ఏర్పాటుకు కావలసిన భూసేకరణ విషయమై జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆరా తీశారు. భూ సేకరణకు సంబంధించి రెవిన్యూ అధికారులు, రైల్వే అధికారులు సంయుక్తంగా స్థల పరిశీలన చేసి నివేదిక అందజేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ ఏర్పాటుకు అదనంగా 2.53 ఎకరాల భూమి కొరకు ప్రతిపాదన పంపాలని జిల్లా కలెక్టర్ రైల్వే అధికారులకు సూచించారు. చుండూరు మండలం మోదుకూరు, చుండూరు వద్ద లెవెల్ క్రాసింగ్ పనులను వేగవన్నం చేయాలని ఆయన అన్నారు.బాపట్లలో రైల్వే స్టేషన్ పరిసరాల అభివృద్ధికి సంబంధించి స్థల సేకరణ విషయంలో పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని ఆయన రైల్వే అధికారులకు తెలిపారు.బాపట్ల జిల్లాలో ప్రవహించే ఈస్ట్ తుంగభద్ర డ్రైన్, రొంపెరు రైట్ అర్మ్, సాఖీ డ్రైన్, గుంటూరు ఛానల్, గణపవరం స్వామి డ్రైన్, నల్లమడ డ్రైన్
ఆధునీకరణ పనులలో సమస్యలను అధిగమించి పనులు వేగవంతం చేయాలని, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ డ్రైనేజీ శాఖాధికారులకు పలు సూచనలు చేశారు. బాపట్ల జిల్లాలో దారిద్య రేఖకు దిగువన ఉన్నటువంటి లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను కేటాయింపుకు స్థల సేకరణలో తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ల్యాండ్ సెక్షన్ సూపర్డెంట్ కు తగు సూచనలు చేశారు. జిల్లాలోని బాపట్ల, చీరాల, అద్దంకి, రేపల్లె మండలాల్లో సేవేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటుకు స్థల సేకరణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్డీవోలకు సూచించారు. జిల్లాలో సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు, పలు మండలాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి స్థల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు పలు సూచన చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్, ల్యాండ్ ఎక్విజిషన్ సెక్షన్ సూపర్డెంట్ శ్రీలక్ష్మి, వీక్షణ సమావేశం ద్వారా బాపట్ల, చీరాల రెవెన్యూ డివిజన్ అధికారులు గ్లోరియా, చంద్రశేఖర్, అద్దంకి, జే పంగులూరు, చీరాల, పర్చూరు, కారంచేడు తాహాసిల్దార్లు, జాతీయ రహదారులు మరియు రైల్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.
