భారత్ న్యూస్ ఢిల్లీ…..విద్యుత్ బిల్లు ‘ప్రైవేటు’ కోసమే!
కేంద్ర ప్రభుత్వం ‘విద్యుత్ చట్టం 2003’కు సవరణ చేయబోతున్నది. ‘విద్యుత్ (సవరణ) బిల్లు 2025’ పేరుతో ముసాయిదాను రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది. అలాగే వెబ్సైట్లో కూడా పెట్టి అభిప్రాయాలు కోరింది. ఈ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించిన దాఖలాలు లేవు.
ఇంతకు ఆ బిల్లులో ఏముందో చూద్దాం. విద్యుత్ చట్టం 2003 సెక్షన్ 14, సెక్షన్ 42 లకు సవరణలు చేయబోతున్నారు. ఈ సవరణ జరిగితే ఒకే ప్రాంతంలో విద్యుత్‌ను పంపిణీ చేయటానికి అనేక కంపెనీలకు లైసెన్సులిస్తారు. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉమ్మడి కృష్ణ, ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలకు ఎ.పి.సి.పి.డి.సి.ఎల్, ఉమ్మడి నెల్లూరు నుండి రాయలసీమ వరకు ఎ.పి.ఎస్.పి.డి.సి.ఎల్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లానుండి ఉత్తంరాంధ్ర మొత్తం ఎ.పి.ఇ.పి.డి.సి.ఎల్ విద్యుత్‌ను పంపిణీ చేస్తున్నాయి. ఇవన్నీ ప్రభుత్వ రంగ సంస్థలే. ప్రైవేటు సంస్థలు లేవు. ఈ చట్ట సవరణ జరిగితే ఈ ప్రాంతాలలో విద్యుత్‌ను పంపిణీ చేయటానికి ప్రైవేటు సంస్థలకు కూడా లైసెన్సులిస్తారు.
అయితే లైసెన్సుదారులు ఎవరికి వారు విడిగా లైన్లు వేయటం, ట్రాన్స్ఫారాలు, సబ్ స్టేషన్లు పెట్టకోవటం కుదరదు కాబట్టి, దీనికోసం మరో సవరణ చేస్తున్నారు. ఈ చట్ట సవరణ జరిగిన అనంతరం ఈ మౌలిక సదుపాయాలను ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు సంస్థలకు పంచి ఇవ్వాలి. అంటే ప్రభుత్వ రంగంలో నిర్మించిన ఈ మౌలిక సదుపాయాలను ఎలాంటి పెట్టుబడి పెట్టే పని లేకుండా ప్రైవేటు సంస్థలు వాడుకొని లాభాలు సంపాదించుకుంటాయి. ఈ మౌలిక సదుపాయాలు లక్షల కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించినవి. వీటిని ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టడానికే ఈ సవరణలను ప్రతిపాదించారు.
దీనితోబాటుగా 1 మెగావాట్ (అంటే 1000 కిలో వాట్లు) కన్నా ఎక్కువ వాడే వినియోగదారుల నుండి ప్రభుత్వరంగ డిస్కంలను తప్పించి ప్రైవేటు రంగానికి కేటాయించే విధంగా మరో సవరణ ప్రతిపాదించారు. ఈ సవరణ జరిగితే అత్యధికంగా విద్యుత్ వాడే పరిశ్రమలు, విజయవాడ, విశాఖపట్నం లాంటి నగరాలు ప్రైవేటు కంపెనీల చేతులలోకి పోతాయి. అంటే బాగా ఆదాయం వచ్చే కనెక్షన్లు, ప్రాంతాలు ప్రైవేటు కంపెనీల చేతులలోకి పోతాయి. ఆదాయం అంతగా రానివి ప్రభుత్వ సంస్థలకు మిగులుతాయి. దీనితో ప్రభుత్వరంగ పంపిణీ సంస్థలు దివాలా తీసి వాటిని కూడా ప్రైవేటు సంస్థలకు అప్పగించవలసిన పరిస్థితి సృష్టించబడుతుంది.
విద్యుత్ వినియోగదారులకు, విద్యుత్ పంపిణీ సంస్థలకు మధ్యవర్తిగా ఉండే లక్ష్యంగా విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్లను ఏర్పాటు చేశారు. అలాంటి రెగ్యులేటరీ కమిషన్‌కు విద్యుత్ మార్కెట్‌ను ప్రోత్సహించే అధికారం ఈ సవరణల ద్వారా ఇవ్వబోతున్నారు. అంటే ఇకమీదట రెగ్యులేటరీ కమిషన్ విద్యుత్ వినియోగదారుల ప్రయోజనాలకన్నా, మార్కెట్‌ను ప్రోత్సహించటానికే ఉపయోగ పడుతుంది.
