భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….రోజుకు మినిమమ్ రూ. 3 నుంచి 5 లక్షలు..! సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అవినీతి దందా.. ఏసీబీ దాడుల్లో వెలుగులోకి
డాక్యుమెంట్ రైటర్లు, ప్రైవేట్ వ్యక్తుల కనుసన్నల్లోనే పనులు
ఒక్కరోజు తనిఖీలతోనే రిజిస్ట్రార్ ఆఫీసుల సిబ్బంది బెంబేలు
ఏసీబీ దాడులు కొనసాగితే మూకుమ్మడిగా సెలవులో వెళ్తామని హెచ్చరికలు
హైదరాబాద్ : స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అక్రమార్కులు ఏకంగా ఒక వ్యవస్థీకృత నెట్‌వర్క్‌ను సృష్టించి రూ.కోట్లు కొల్లగొడుతున్నారని ఏసీబీ దాడుల్లో వెల్లడైంది. రాష్ట్రవ్యాప్తంగా పలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కేవలం కొన్ని గంటల పాటు జరిగిన తనిఖీల్లోనే అధికారుల అక్రమ సంపాదన చూసి ఏసీబీ అధికారులు సైతం విస్తుపోయినట్టు తెలుస్తున్నది. కొన్ని కీలక ప్రాంతాల్లో ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోని సిబ్బంది స్థానిక రాజకీయ నాయకులు, దళారులు, డాక్యుమెంట్ రైటర్లతో కలిసి రోజుకు కనీసం రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అక్రమంగా ఆర్జిస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.
భూముల రిజిస్ట్రేషన్, మార్కెట్ విలువ నిర్ధారణ వంటి అత్యవసర పనులకు కూడా సాధారణ ఫీజు కంటే అదనంగా పెద్ద మొత్తంలో ముడుపులు సమర్పించుకోవాల్సి వస్తోందని తేల్చారు. ఈ దందా అంతా కూడా కార్యాలయ సిబ్బంది, ప్రైవేట్ వ్యక్తులు, డాక్యుమెంట్ రైటర్ల కనుసన్నల్లోనే అత్యంత పకడ్బందీగా సాగుతోందని తెలుస్తున్నది. ఆఫీసు బయట కూర్చునే కొందరు ప్రైవేట్ వ్యక్తులే లోపల జరిగే ప్రతి లావాదేవీని, రేటును శాసిస్తున్న పరిస్థితి నెలకొందని చెప్తున్నారు.
లంచం డబ్బులు ఎక్కడా రికార్డుల్లో కనిపించకుండా, కేవలం కోడ్ భాషలో వ్యవహారాలు నడుపుతూ, లంచం మొత్తం సేకరించిన తర్వాతే పత్రాలు ముందుకు కదిలేలా వారు తమదైన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారని తనిఖీల్లో తేలింది. దీంతో ఆఫీస్ సిబ్బంది, రిజిస్ర్టేషన్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు కాకుండా ఇతరులను రిజిస్ట్రార్ ఆఫీసుల్లోకి రాకుండా నియంత్రించాలని ప్రభుత్వం భావిస్తున్నది.
ఏరియాను బట్టి మారుతున్న లంచాల రేటు..
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉన్న ప్రాంతాన్ని బట్టి ఈ లంచాల రేటు కూడా మారుతోందని తెలుస్తోంది. నగరాలు, శివారు ప్రాంతాల్లో ఉన్న విలువైన భూముల రిజిస్ట్రేషన్లలో దోపిడీ మరింత అధికంగా ఉందని చెప్తున్నారు. కొన్నిచోట్ల ఎలాంటి లిటిగేషన్ లేని సాధారణ రిజిస్ట్రేషన్‌కు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు లంచంగా తీసుకుంటున్నారని.. మరికొన్నిచోట్ల ఈ మొత్తం రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు కూడా చేరిందని పేర్కొంటున్నారు. అంటే, ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తి తన జీవితంలో అతి ముఖ్యమైన ఆస్తిని రిజిస్టర్ చేసుకోవాలంటే, చట్టబద్ధమైన ఫీజుతో పాటు అదనంగా వేల రూపాయలు అక్రమార్కులకు ముట్టజెప్పాల్సిన దుస్థితి ఉందన్న ఆరోపణలు ఉన్నాయి.
ఏదైనా భూమికి చిన్నపాటి లిటిగేషన్ (వివాదం) ఉన్నా, లేదా నిబంధనల విషయంలో కొంత సడలింపు అవసరమైన పనులు చేయించుకోవాలన్నా పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని.. అలాంటి కేసుల్లో లంచం మొత్తం వేలల్లో కాకుండా ఏకంగా లక్షల రూపాయల్లో ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు. అధిక మొత్తంలో లంచం తీసుకుని చట్టాన్ని, నిబంధనలను సైతం పక్కన పెట్టి రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ అండదండలు ఉన్న కొందరు డాక్యుమెంట్ రైటర్లు, దళారులు ఈ లంచాల దందాను నడిపిస్తూ, వసూలు చేసిన మొత్తాన్ని అధికారులు, సిబ్బందికి పంచుతున్నట్లు తెలుస్తోంది.
అంతా బయట వ్యక్తులు.. డాక్యుమెంట్ రైటర్లతోనే
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది తమ సొంత కార్యకలాపాలు నిర్వహించడం కంటే, ఈ డాక్యుమెంట్ రైటర్లు, ప్రైవేట్ దళారుల మాటే శిరోధార్యంగా పనిచేయడం ఏసీబీ దాడుల్లో గుర్తించింది. రిజిస్ట్రేషన్ పత్రాలను తయారు చేయడం నుంచి, ఆ పత్రాలను సబ్ రిజిస్ట్రార్ వద్దకు తీసుకెళ్లి సంతకాలు చేయించడం వరకు ప్రతి దశలోనూ ఈ ప్రైవేట్ వ్యక్తులే కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఒక డాక్యుమెంట్ రైటర్ ఏకంగా తన రోజువారీ సంపాదన లక్షల్లో ఉందని, ఇందులో అధికారులకు ఇచ్చే వాటాయే అధికమని స్వయంగా ఒప్పుకున్నట్లు ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి.
ఇది కేవలం ఒక కార్యాలయం పరిస్థితి మాత్రమే కాదని, రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ల శాఖలో ఇదే తరహా వ్యవస్థ పాతుకుపోయిందని తాజా దాడుల ద్వారా స్పష్టమైంది. అయితే, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో, సబ్ రిజిస్ట్రార్ ఇండ్లలో ఏసీబీ దాడులు, తనిఖీలు ఇలాగే కొనసాగితే విధులకు హాజరుకాకుండా మూకుమ్మడిగా సెలవుపై వెళ్తామని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఉద్యోగులు, సిబ్బంది ఏకంగా ప్రభుత్వానికే హెచ్చరికలు చేస్తుండటం గమనించదగ్గ విషయం.
అన్నీ సక్రమంగా ఉన్నా ఇచ్చుకోవాల్సిందే..
చట్టబద్ధంగా, ఎలాంటి వివాదాలు లేకుండా ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా.. లంచం ఇవ్వనిదే అడుగు ముందుకు పడని పరిస్థితి రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నెలకొందని చెప్తున్నారు. భూమి రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ సరిగ్గా ఉన్నా, భూమికి ఎలాంటి లిటిగేషన్ లేకపోయినా.. రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ముందుగానే లంచం రేటు ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారని తెలుస్తున్నది. రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వచ్చిన వారు దీని గురించి డాక్యుమెంట్ రైటర్లను అడిగితే, “అన్నీ సరిగ్గా ఉన్నాయి కదా? అని అనుకోవడానికి లేదు.

అన్ని పత్రాలు ఉన్నా, ప్రతి రిజిస్ట్రేషన్‌కు కొంత మొత్తం ఇచ్చుకోవాల్సిందే” అనే సమాధానం వస్తోందని అంటున్నారు. ఈ ‘కప్పం’ కట్టకపోతే ఫైలు ముందుకు కదలదని, చిన్న చిన్న అభ్యంతరాలు పెట్టి రిజిస్ట్రేషన్‌ను రోజుల తరబడి నిలిపివేసే ప్రమాదం ఉందని వారు ముందే హెచ్చరిస్తున్నారని.. పద్ధతి ప్రకారం అంతా ముందే చెప్పి, లంచాన్ని వసూలు చేసి, ఆ తర్వాతే పని మొదలుపెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.