భారత్ న్యూస్ ఢిల్లీ…..చెల్లాచెదురుగా శరీర భాగాలు
చావు నోట్లోంచి బయటపడ్డాం..
ఢిల్లీ పేలుడుపై ప్రత్యక్ష సాక్షి
న్యూఢిల్లీ: ఎర్రకోట మెట్రో స్టేషన్ గెట్ నెంబర్ 1 వద్ద పార్కింగ్ స్థలంలో ఉంచిన కారులో సోమవారం సాయంత్రం భారీ పేలుడు దేశ రాజధానిని కుదిపేసింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా, మరో 12 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదం అనంతరం స్థానికంగా భీతావహ వాతావరణం నెలకొంది. పేలుడు జరిగినప్పుడు తాము కూడా చావబోతున్నామనే భయం తమను కుదిపేసిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.
‘ఇంత పెద్ద పేలుడు నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. పేలుడు ధాటికి మూడుసార్లు పడిపోయా. నేను కూడా చనిపోబోతున్నానని అనిపించింది’ అని స్థానిక వ్యాపారి ఒకరు వెల్లడించారు. పేలుడు సమయంలో ఆ సమీపంలోనే ఉన్న మరో ప్రత్యక్ష సాక్షి తనకెదురైన భయంకర అనుభవాన్ని చెప్పారు. రోడ్డుపై శరీర భాగాలు చెల్లాచెదురుగా పడివుండటం తాను చూశానని, అసలు ఏం జరిగిందో అప్పుడు తమకు అర్థం కాలేదని చెప్పారు. పేలుడు ధాటికి పలు కార్లు కూడా దెబ్బతిన్నాయని తెలిపారు. రోడ్డుపై ఒక వ్యక్తి చెయ్యి కనిపించడంతో తాను షాక్ అయ్యానిని, ఈ ఘోరాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నానని అన్నారు.

పేలుడు ఘటనపై స్థానిక యువకుడు రాజ్‌ధార్ పాండే వివరిస్తూ, పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం తాను ఇంట్లోంచి చూశానని, ఏం జరిగిందో తెలుసుకునేందుకు బయటకు వచ్చానని చెప్పారు. చాలా పెద్ద పేలుడు సంభవించినట్టు తెలిపారు. కాగా, పేలుడు నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. డిల్లీ పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం, క్లూస్ టీమ్ ఘటనా స్థలికి చేరుకున్నాయి..