భారత్ న్యూస్ రాజమండ్రి…నేటి నుంచి ‘స్వామిత్వ’ ప్రత్యేక గ్రామసభలు

Ammiraju Udaya Shankar.sharma News Editor…గ్రామ కంఠాల్లో ఇళ్లు, స్థలాలకు ప్రాపర్టీ కార్డులు జారీ చేసే ముందు ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణకు సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించనున్నారు.
స్వామిత్వ పథకంలో రెండో విడత కింద 45 లక్షల ఆస్తులకు కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రజలకు వీటిని అందించే ముందు మరోసారి గ్రామసభలు నిర్వహించాలన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, సర్వే శాఖలు సంయుక్తంగా ఈ నెల 22 వరకు గ్రామసభలు నిర్వహించనున్నాయి.
డ్రోన్ సర్వే తర్వాత గ్రామకంఠాల్లో ఆస్తులకు సంబంధించిన కొలతలు నిర్ధారించుకునేందుకు 2,300 గ్రామాల్లో సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలు సిద్ధం చేశారు.
గ్రామసభల్లో ప్రజల నుంచి వీటిపై అభ్యంతరాలు స్వీకరించాకే ప్రాపర్టీ కార్డులు జారీ చేయాలని నిర్ణయించారు.
కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని ఇటీవల జరిగిన సమీక్షలో ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

మూడో దశ కార్యక్రమం కూడా ప్రారంభించి మార్చి నెలాఖరు నాటికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కోటి కార్డులు పంపిణీ చేయాలని ఆయన నిర్దేశించారు.