అమెరికాలో కొనసాగుతున్న సంక్షోభం.. రెండో రోజూ 1,000కి పైగా విమానాలు రద్దు

భారత్ న్యూస్ ఢిల్లీ…..అమెరికాలో కొనసాగుతున్న సంక్షోభం.. రెండో రోజూ 1,000కి పైగా విమానాలు రద్దు

అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్ కారణంగా విమానయాన సంక్షోభం

వరుసగా రెండో రోజు 1,000కి పైగా విమాన సర్వీసులు క్యాన్సిల్‌

జీతాలు రాకపోవడంతో విధులకు గైర్హాజరవుతున్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు

దశలవారీగా విమానాలను తగ్గించాలని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశం

షార్లెట్, అట్లాంటా, చికాగో వంటి ప్రధాన విమానాశ్రయాలపై తీవ్ర ప్రభావం

థ్యాంక్స్ గివింగ్ నాటికి పరిస్థితి మరింత దిగజారవచ్చని నిపుణుల హెచ్చరిక

అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్ ప్రభావం విమానయాన రంగంపై తీవ్రంగా పడింది. ఎయిర్ ట్రాఫిక్‌ను తగ్గించాలన్న ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ఆదేశాలతో విమానయాన సంస్థలు వరుసగా రెండో రోజైన శనివారం కూడా 1,000కి పైగా విమానాలను రద్దు చేశాయి. దీంతో దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

ఫ్లైట్ అవేర్ వెబ్‌సైట్ ప్రకారం నిన్న‌ మధ్యాహ్నానికే 1,000కి పైగా విమానాలు రద్దయ్యాయి. ముఖ్యంగా నార్త్ కరోలినాలోని షార్లెట్ విమానాశ్రయంలో అత్యధికంగా 130 విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. అట్లాంటా, చికాగో, డెన్వర్, నెవార్క్ వంటి ఇతర ప్రధాన ఎయిర్‌పోర్టులలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. న్యూయార్క్ నగర పరిసరాల్లోని విమానాశ్రయాల్లో సిబ్బంది కొరత కారణంగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. షట్‌డౌన్ కొనసాగితే రానున్న రోజుల్లో రద్దయ్యే విమానాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం 40 విమానాశ్రయాల్లో 4 శాతం విమానాలను తగ్గించామని, మంగళవారం నుంచి ఈ సంఖ్యను మరింత పెంచి, శుక్రవారం నాటికి 10 శాతానికి చేర్చుతామని ఎఫ్ఏఏ తెలిపింది. షట్‌డౌన్ కొనసాగి, మరింత మంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు విధులకు దూరమైతే మరిన్ని కోతలు విధించాల్సి వస్తుందని రవాణా శాఖ కార్యదర్శి సీన్ డఫీ హెచ్చరించారు.

ఎందుకీ పరిస్థితి?
ప్రభుత్వ షట్‌డౌన్ కారణంగా దాదాపు నెల రోజులుగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు జీతాలు అందడం లేదు. దీంతో చాలామంది అనారోగ్య కారణాలు చూపి విధులకు గైర్హాజరవుతున్నారు. ఇప్పటికే ఉన్న సిబ్బంది కొరతకు ఇది తోడవడంతో విమానాల నిర్వహణ కష్టంగా మారింది. జీతాలు లేకుండానే వారానికి ఆరు రోజులు తప్పనిసరిగా ఓవర్ టైమ్ చేయాల్సి వస్తోందని, కొందరు తమ కుటుంబ ఖర్చుల కోసం రెండో ఉద్యోగం కూడా చేసుకుంటున్నారని నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ అసోసియేషన్ తెలిపింది.

ప్రయాణికుల ఆవేదన
ఈ ఆకస్మిక పరిణామాలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. “మనమందరం ప్రయాణాలు చేస్తాం. అందరికీ ఎక్కడికో ఒకచోటికి వెళ్లాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఈ సమస్యను త్వరగా పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాను” అని మియామి నుంచి డొమినికన్ రిపబ్లిక్‌కు వెళుతున్న ఎమ్మా హోల్గిన్ అనే ప్రయాణికురాలు తన ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రయాణం చేయడమే ఒత్తిడితో కూడుకున్నది. దానికి తోడు ఇలాంటి అంతరాయాలు ఏర్పడితే పరిస్థితి మరింత సవాలుగా మారుతుంది” అని ప్యూర్టోరికోకు వెళుతున్న హీథర్ జు అనే మరో ప్రయాణికురాలు అన్నారు.

విమానాల రద్దు ఇలాగే కొనసాగితే థ్యాంక్స్ గివింగ్ వారం నాటికి పరిస్థితి మరింత దిగజారి, పర్యాటకం, హాలిడే షిప్పింగ్‌పై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.