భారత్ న్యూస్ ఢిల్లీ..సైన్యానికీ కులం అంటించిన రాహుల్ – ఇలా అయిపోతున్నారేంటి ?
అందాల పోటీల్లో బీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఎక్కడ ఉంటున్నారు.. అందరూ అగ్రవర్ణాల వారే అని ఒకప్పుడు రాహుల్ గాంధీ తెగ బాధపడిపోయేవారు. ఇప్పుడు ఆయన ఇంకాస్త దిగజారిపోయారు. ఏకంగా సైన్యానికి కులం అంటించి.. పది శాతం కులాలకు చెందిన వారే అంతా నడిపిస్తున్నారని.. అంటున్నారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి.
పదిశాతం అగ్రవర్ణాలదే ఆధిపత్యమని రాహుల్ ఆరోపణ
బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లా కుటుంబా ప్రాంతంలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సమావేశంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైన్యానికి కులం అంటించి ఆరోపణలు చేశారు. దేశంలో 10 శాతం మంది ఆర్మీ, న్యాయస్థానాలను నియంత్రిస్తున్నారని, మిగిలిన 90 శాతం అవకాశం కోల్పోతున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ కులం ఆధారంగా ప్రజల్ని రెచ్చగొట్టాలని ఇలా అన్ని వ్యవస్థల్లో అగ్రవర్ణాలే ఉన్నాయని ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరో ఆయన చెప్పలేదు.
అందర్నీ సమానంగా అభివృద్ధి చేయని గాంధీలదే పాపం
కులగణన పేరుతో ఆయన చేసిన రాజకీయం వర్కవుట్ కావడం లేదు. కానీ ఎలాగోలా ప్రజల్ని రెచ్చగొట్టి కులాల పరంగా విభజిస్తే.. వారందరికీ అన్యాయం జరిగిందని నమ్మిస్తే తన పని సులువు అవుతుందని.. ప్రతి రంగాన్ని కులం పరిధిలోకి తీసుకువస్తున్నారు రాహుల్. నిజానికి అదే నిజం అయితే ముందుగా శిక్షించాల్సింది గాంధీ కుటుంబాన్నే. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజలందర్నీ సమానంగా అభివృద్ధి చేసే అవకాశం వచ్చినా… సరైన పాలన చేయలేదని రాహుల్ మాటల వల్ల అర్థమైపోతుంది. దశాబ్దాల తర్వాత కూడా దళితులు, ఇతర వర్గాలు వెనుకబడి ఉన్నాయని గాంధీ కుటుంబానిదే నేరం.
ఇప్పుడు ప్రతిభ ఉన్న వారికి అవకాశాలు –

నిజానికి ఆయా వ్యవస్థలు అన్నీ అగ్రవర్ణాల చేతుల్లో.. ఆధిపత్యంలో ఉంటే అది ఖచ్చితంగా సుదీర్ఘంగా పరిపాలించిన గాంధీ కుటుంబం తప్పే. ఆర్థికంగా, సామాజికంగా అందర్నీ సమానంగా పైకి తేవాల్సిన పాలకులు పట్టించుకోలేదని అర్థం. ఇప్పుడు దాన్నే అవకాశంగా చేసుకుని ప్రజల మధ్య చిచ్చు పెట్టాలనుకోవడం అదే గాంధీ కుటుంబం చేస్తున్న అరాచకం. ప్రజలు ఈ ట్రాప్ లో పడే అవకాశాలు లేవు. ఇప్పుడు అన్ని వర్గాలు అంది వస్తున్న అవకాశాలను .. అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.