భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….మావోయిస్టు రాజకీయ ఖైదీ సంజయ్ దీపక్ రావు రెండో రోజు నిరహార దీక్ష.
చర్లపల్లి సెంట్రల్ జైలు – మానస, మంజీర బ్లాక్‌లలో ఖైదీల హక్కుల ఉల్లంఘనపై వెంటనే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విచారణ జరపాలి
చర్లపల్లి సెంట్రల్ జైలులోని మానస, మంజీర బ్లాక్‌లలో ఉన్న ఖైదీలను చట్టప్రకారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు వారి బ్లాక్‌లలో తిరగడానికి అనుమతి ఇవ్వవలసి ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆ హక్కును ఉల్లంఘిస్తున్నారు.
కొంతమంది ఖైదీలను బ్లాక్ వరండాలో లాకప్ చేస్తుండగా, మరికొందరిని సెల్‌లలో బంధిస్తున్నారు. కానీ వారిని బ్లాక్‌లలో స్వేచ్ఛగా తిరగనివ్వడం లేదు. దాని మూలంగా ఆ ఖైదీలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.
ఈ రెండు బ్లాక్‌లలో ప్రధానంగా రాజకీయ ఖైదీలను ఉంచారు. రాజకీయ ఖైదీలు ఉంటున్న మానస, మంజీర బ్లాక్‌లలో DLSA జడ్జిల నిరంతర పర్యవేక్షణ లేకపోవడం వల్ల, ఆ ఖైదీలకు వారి బ్లాక్‌లలో తిరగడానికి ఎలాంటి అవకాశం ఇవ్వడం లేదని సమాచారం అందుతోంది.
“అధిక భద్రత” పేరుతో చట్టాన్ని తప్పుగా వాడుకుంటూ, రాజకీయ ఖైదీలనే కారణంగా ఖైదీల ప్రాథమిక హక్కులను అణచివేయడానికి జైలు సూపరింటెండెంట్ ప్రయత్నిస్తున్నారు.
మంజీర, మానస బ్లాక్‌లలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు లాకప్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తూ, ఆరోపిత సిపిఐ (మావోయిస్ట్) సెంట్రల్ కమిటీ సభ్యుడు సంజయ్ దీపక్ రావు అక్టోబర్ 28 నుండి నిరాహార దీక్ష ప్రారంభించారు.
మేము తక్షణమే చట్టప్రకారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఖైదీలకు వారి బ్లాక్‌లలో స్వేచ్ఛగా తిరగడానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము.
సూపరింటెండెంట్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఖైదీలు బ్లాక్‌లలో స్వేచ్ఛగా తిరగడానికి అనుమతి ఇస్తున్నారా లేదా అనేది స్పష్టంగా చెప్పాలి.
“వరండా లాకప్ చేస్తున్నాం, సెల్‌లలో నిర్బంధం చేయడం లేదు” అనే అవకాశవాద వాదనలతో న్యాయస్థానాల నుంచి తప్పించుకోకుండా, నిజంగా స్వేచ్ఛగా తిరగడానికి అనుమతిస్తారా లేదా అనేది రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో వారి న్యాయవాది జాబాలి వేసిన కేసు నం. 1253/IN/2025 లో సూపరింటెండెంట్ స్పష్టంగా చెప్పాలి.
ఆ బ్లాక్‌లలో ఉన్న CCTV ఫుటేజీల ఆధారంగా సూపరింటెండెంట్‌పై విచారణ జరిపి కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము.

అలాగే, DLSA జడ్జిలు క్రమం తప్పకుండా మానస, మంజీర బ్లాక్‌లలో పర్యవేక్షణ చేసి, ఖైదీల హక్కులు ఉల్లంఘించబడకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని మేము గట్టిగా కోరుతున్నాము.
– గుంటి రవి
CLC తెలంగాణ, ఉపాధ్యక్షుడు