ఇంటి భోజనంతో మహిళలకు ఉపాధి.. అమరావతిలో సీఆర్డీఏ కొత్త పథకం

భారత్ న్యూస్ విజయవాడ…ఇంటి భోజనంతో మహిళలకు ఉపాధి.. అమరావతిలో సీఆర్డీఏ కొత్త పథకం

అమరావతి మహిళల కోసం సీఆర్డీఏ క్లౌడ్ కిచెన్ పథకం

ఇంటి నుంచే వంట చేసి ఆదాయం పొందే గొప్ప అవకాశం

నిపుణులతో 35 మందికి 26 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ

కేవలం రూ.99కే రుచికరమైన, నాణ్యమైన ఇంటి భోజనం

ప్రస్తుతం సీఆర్డీఏ కార్యాలయానికి భోజనం అందిస్తున్న మహిళలు

ఈ పథకంతో మహిళలను లక్షాధికారులుగా మార్చడమే లక్ష్యం

అమరావతి: రాజధాని గ్రామాల్లోని మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘క్లౌడ్ కిచెన్’ పేరుతో సరికొత్త పథకాన్ని అమలు చేస్తూ, మహిళలు తమ ఇళ్ల నుంచే ఉపాధి పొందేందుకు మార్గం సుగమం చేస్తోంది. ఈ పథకం ద్వారా అమరావతి నిర్మాణ పనుల్లో పాల్గొంటున్న కార్మికులు, అధికారులు, ఉద్యోగులకు నాణ్యమైన ఇంటి భోజనాన్ని కేవలం రూ.99కే అందిస్తున్నారు.

నిపుణులతో ప్రత్యేక శిక్షణ
ఈ పథకం కింద, రాజధానిలోని ప్రతి గ్రామం నుంచి సుమారు 35 మంది మహిళలను ఎంపిక చేసి వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో బ్యాచ్‌కు 26 రోజుల పాటు వంటల తయారీలో మెళకువలు, పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలు, వ్యాపార నిర్వహణ వంటి అంశాలపై నిపుణులతో తర్ఫీదు ఇప్పిస్తున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత వారు భోజనం తయారీ ప్రారంభించేలా ప్రోత్సహిస్తున్నారు.

ఇటీవల లింగాయపాలెం గ్రామానికి చెందిన ఆరుగురు మహిళల బృందం శిక్షణ పూర్తి చేసుకుని, తమ క్లౌడ్ కిచెన్‌ను ప్రారంభించింది. వీరు నూతనంగా ప్రారంభమైన సీఆర్డీఏ కార్యాలయంలోని ఉద్యోగులకు భోజనం సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం రోజుకు 100కి పైగా ఆర్డర్లు వస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళలను లక్షాధికారులను చేయడమే తమ లక్ష్యమని సీఆర్డీఏ జూనియర్ లైవ్లీహుడ్ స్పెషలిస్ట్ నరసింహం పేర్కొన్నారు.

ఈ పథకంపై మహిళల నుంచి మంచి స్పందన వస్తోంది. “ఇంటి వద్దే ఉంటూ ఆదాయం పొందేందుకు క్లౌడ్ కిచెన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సీఆర్డీఏ శిక్షణ ఇచ్చి ప్రోత్సహించడం ద్వారా మాకు ఆర్థిక భరోసా లభిస్తుంది” అని హర్షం వ్యక్తం చేస్తున్నారు