భారత్ న్యూస్ నెల్లూరు….ఏపీలో రవాణా శాఖ ప్రత్యేక డ్రైవ్.. ట్రావెల్స్ బస్సులపై 289 కేసులు
అమరావతి: కర్నూలులో బస్సు ప్రమాదం దృష్ట్యా ఏపీలో రవాణా శాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. రవాణా శాఖ కమిషనర్ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రైవేటు వాహనాలపై విస్తృత తనిఖీలు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ట్రావెల్ బస్సులపై 289 కేసులు నమోదు చేశారు. 18 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను సీజ్ చేసి రూ.7.08 లక్షల జరిమానాలు విధించారు.

అత్యధికంగా ఏలూరులో 55 కేసులు నమోదు చేశారు. 3 ట్రావెల్స్ బస్సులు సీజ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 17 కేసులు నమోదు చేసి.. 4 బస్సులు సీజ్ చేశారు. కోనసీమ జిల్లాలో 27, చిత్తూరు జిల్లాలో 22, కర్నూలు జిల్లాలో 12, విశాఖలో 7, నంద్యాలలో 4 కేసులు నమోదు చేశారు. సరైన ధ్రువపత్రాలు లేవని 8 బస్సులు, అత్యవసర ద్వారం లేదని 13 బస్సులపై కేసులు ఫైల్ చేశారు. అగ్నిమాపక పరికరాలు లేవని 103 బస్సులపై, ప్యాసింజర్ లిస్టు లేని కారణంగా 34 బస్సులపై, ఇతర ఉల్లంఘనలపై 127 కేసులు నమోదు చేశారు. ప్రత్యేక డ్రైవ్ రోజూ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.