భారత్ న్యూస్ విజయవాడ…ఇక నుంచి బ్యాంకు ఖాతాకు నలుగురు నామినీలు
నవంబర్ 1 నుంచి అమలు
బ్యాంకు ఖాతాలు, లాకర్లు ఉన్న వారికి ఇప్పటిదాకా ఒక్కరినే నామినీగా పేర్కొనే అవకాశం ఉండేది. కానీ, ఇకపై నలుగురిని నామినీగా ఉంచే వీలుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనలు నవంబరు 1, 2025 నుంచి అమల్లోకి రానున్నాయి. మన దేశంలోని బ్యాంకుల్లో దాదాపు రూ.67,000 కోట్లకు పైగా డబ్బు ఎవరూ వెనక్కి తీసుకోకుండా అలా ఉండిపోయింది. ఖాతాదారుడు మరణించిన తర్వాత, ఉన్న ఒక్క నామినీ అందుబాటులో లేకపోవడం, లేదా క్లెయిమ్ చేసుకోకపోవడం వల్ల ఇలా జరుగు తోంది. దీంతో కుటుంబ సభ్యులు, డబ్బులు వెనక్కి తీసుకోవడం కోసం పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఇవి బ్యాంకు పొదుపు ఖాతా, ఫిక్స్డ్, రికరింగ్ డిపాజిట్ ఖాతాలతో పాటు, లాకర్లకూ వర్తిస్తాయి.
ఒకేసారి నలుగురి నామినేషన్:
మీరు మీ ఖాతాకు ఒకేసారి నలుగురిని నామినీలుగా పేర్కొన వచ్చు. అంతేకాదు, ఎవరికి ఎంత వాటా (శాతం) వెళ్లాలి అన్నదీ మీరే నిర్ణయించుకోవచ్చు. ఉదాహరణకు జీవిత భాగస్వామికి 50 శాతం, మిగతాది పిల్లలకు అన్నట్లు పంపకాలు చేయొచ్చు.
ఒకరి తర్వాత మరొకరు: నలుగురు నామినీలను వరుస క్రమంలోనూ ఏర్పాటు చేయొచ్చు. అంటే, మొదటి నామినీ అందుబాటులో లేకపోతే, రెండో నామినీకి అర్హత వస్తుంది. వారూ లేకపోతే మూడో వారికి…ఇలా ఒకరి తర్వాత మరొకరికి అవకాశం ఉంటుంది. డిపాజిట్ ఖాతాలకు పైన చెప్పిన రెండు పద్ధతుల్లో మీకు నచ్చిన విధానాన్ని ఎంచుకోవచ్చు.

నామినీ పేర్లను నమోదు చేసేటప్పుడు, వారి ఫోన్ నంబరు, ఇ-మెయిల్ ఐడీ వంటి వివరాలూ ఇవ్వాలి. దీనివల్ల అవసరమైన సందర్భంలో బ్యాంకు వారిని సులభంగా సంప్రదించగలదు.