రౌడీ షీటర్లపై పోలీస్ నజర్.. వారి అరాచకాలను అరికట్టడంపై కసరత్తు..

..భారత్ న్యూస్ హైదరాబాద్….రౌడీ షీటర్లపై పోలీస్ నజర్.. వారి అరాచకాలను అరికట్టడంపై కసరత్తు..

రాష్ట్రంలో 6 వేల మందిపై రౌడీ, హిస్టరీ షీట్లు

రౌడీ షీటర్ల కార్యకలాపాలపై ప్రత్యేకంగా నిఘా

కుటుంబసభ్యుల ముందే కౌన్సెలింగ్

కానిస్టేబుల్‌ ప్రమోద్‌ హత్యతో డిపార్ట్మెంట్ అలర్ట్

పాతబస్తీలో 101 మంది రౌడీ షీటర్లు..

11 గ్యాంగులు

నగరాల నుంచి పల్లెల దాకా భూ కబ్జాలు, సెటిల్మెంట్లు

రాష్ట్రంలో రౌడీ షీటర్లు అరాచకం సృష్టిస్తున్నారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలుచోట్ల నిత్యం భూ కబ్జాలు, సెటిల్‌మెంట్లు, ఇతర దందాల్లో మునిగితేలుతున్నారు. ఈ క్రమంలో అడ్డొచ్చినవారిపై దాడులు, హత్యలకు తెగబడ్తున్నారు. హైదరాబాద్ లోనైతే ఆధిపత్య పోరుతో నడిరోడ్లపై కత్తులతో పరస్పర దాడులు చేసుకోవడం, గన్ ఫైరింగ్ లకు పాల్పడడం కామన్గా మారింది.

ఇటీవలి కాలంలో జరిగిన దాడులు, హత్యల్లో రౌడీ షీటర్లు కీలకపాత్ర పోషించినట్లు పోలీస్రికార్డులు చెప్తున్నాయి. తాజాగా నిజామాబాద్‌లో రౌడీ షీటర్ షేక్‌ రియాజ్‌ ఏకంగా కానిస్టేబుల్ ప్రమోద్‌కుమార్‌ ను హత్య చేయడంతో పోలీస్‌ శాఖ అప్రమత్తమైంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రౌడీ షీటర్ల లెక్క తీస్తున్న పోలీసులు, వారిని కట్టడి చేసేందుకు ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలనేదానిపై కసరత్తు చేస్తున్నారు.

ల్యాండ్ సెటిల్మెంట్లు, భూకబ్జాలు..

ప్రధానంగా రౌడీ షీటర్లను స్థానిక రాజకీయ నేతలే ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొందరు పోలీస్అధికారులు కూడా రౌడీ షీటర్లతో సంబంధాలు పెట్టుకొని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులూ వస్తున్నాయి. ఇలా కొంతమంది రాజకీయనాయకులు, పోలీస్అధికారుల అండదండలతో రౌడీ షీటర్లు రెచ్చిపోతున్నారు. హైదరాబాద్లో సివిల్‌ వివాదాలు, ముఖ్యంగా ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. కొందరు రౌడీ షీటర్లయితే వడ్డీ వ్యాపారం చేస్తూ ఆస్తులు ఆక్రమిస్తున్నారు. ఈ క్రమంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి.

ముఖ్యంగా హైదరాబాద్‌ పాతబస్తీ సహా అనేక బస్తీల్లో రౌడీ షీటర్లే గల్లీ లీడర్లుగా చెలామణి అవుతున్నారు. సామాన్యుల గొడవలు, ఆర్థిక వ్యవహారాలు, ఆస్తి పంపకాల్లోకీ ఎంటరై బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో దాడులు, హత్యాయత్నాలు, హత్యలకూ తెగబడ్తున్నారు. కొంతమంది రౌడీ షీటర్లు పేకాట స్థావరాలు, వ్యభిచార గృహాలు, గంజాయి, డ్రగ్స్సప్లై లాంటి దందాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఏడు నెలల కాలంలో హైదరాబాద్‌లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తూ అరెస్టయిన వారిలో ఎక్కువ మంది రౌడీ షీటర్లే ఉన్నారని పోలీసులు చెప్తున్నారు.

జిల్లాల్లోనూ వందల్లో రౌడీ షీట్లు..

హైదరాబాద్లాంటి సిటీలోనే కాదు, జిల్లాల్లోనూ రౌడీ షీటర్లు పెరిగిపోతున్నారు. ఉదాహరణకు నిర్మల్‌ జిల్లాలో దాదాపు 500 మందిపై రౌడీ షీట్లు తెరిచినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కాగా నిజామాబాద్ లో ప్రమోద్హత్య అనంతరం పోలీస్ శాఖ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల ఎస్పీలను అలర్ట్చేశారు. ఐజీ స్థాయి అధికారులు, కమిషనర్లు, ఎస్పీ స్థాయి అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై రౌడీ షీటర్ల కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు.

రౌడీ షీటర్ల కదలికలపై నిఘా పెంచాలని నిర్ణయించిన అధికారులు నిర్మల్లాంటి జిల్లాల్లో స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన రౌడీ షీటర్ల కార్యకలాపాలపై నిఘా పెట్టారు. వారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఏదైనా దందాల్లో, సెటిల్మెంట్లలో ఇన్వాల్వ్ అవుతున్నారా? లాంటి వివరాలు ఆరా తీస్తున్నారు. ఎప్పట్లాగే వివిధ సందర్భాల్లో బైండోవర్చేయడం కాకుండా ఈసారి కొత్తగా కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ఇవ్వాలని నిర్ణయించారు. వారి వెనుక ఉన్న స్థానిక నాయకులను కూడా పిలిపించి, కౌన్సెలింగ్ఇస్తామని ఓ పోలీస్ అధికారి ‘వెలుగు’తో పేర్కొన్నారు. తద్వారా రౌడీ షీటర్ల ఆగడాలకు చాలావరకు అడ్డుకట్ట వేయవచ్చని తాము భావిస్తున్నట్లు తెలిపారు.

గ్రేటర్‌లో 3 వేల రౌడీ షీట్లు.. 3 వేల హిస్టరీ షీట్లు

హైదరాబాద్‌లోని మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో దాదాపు 3 వేల మందికి పైగా రౌడీ షీటర్లు పోలీసుల రికార్డులో ఉన్నారు. గణేశ్శోభాయాత్ర సహా భారీ ఉత్సవాలు, ఎలక్షన్లు, వీవీఐపీల పర్యటనల సమయంలో వీరిని పోలీసులు బైండోవర్ చేస్తుంటారు. నిర్ణీత సమయం వరకు స్టేషన్‌కు పిలిపించి సంతకాలు తీసుకుంటారు.

ఈ క్రమంలోనే వరుస నేరాలు చేసే వారిపై హిస్టరీ షీట్లు, అనుమానితులపై సస్పెక్ట్‌ షీట్లు ఓపెన్‌ చేస్తున్నారు. ఈ మేరకు గతేడాది వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,689 మందిపై హిస్టరీ షీట్లు నమోదు కాగా, 2,758 మందిపై పోలీసులు సస్పెక్ట్‌ షీట్లు ఓపెన్ చేశారు. వీరికి సంబంధించి నేరాలతో కూడిన పూర్తి వివరాలను పోలీస్ డిజిటల్ రికార్డులో పొందుపరిచారు. తాజా ఘటనల నేపథ్యంలో ఇలాంటి వారిపై పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కౌన్సిలింగ్‌ నిర్వహించి బైండోవర్లు చేసేందుకు చర్యలు చేపట్టారు.

రౌడీ షీటర్ వేధింపులతో ఖమ్మం జిల్లా వి.వెంకటాయపాలెం జగ్యా తండాకు చెందిన బోడ సుశీల(28) అనే మహిళ సోమవారం ఆత్మహత్య చేసుకుంది. పొలంలో పని చేసుకుంటున్న సుశీలను అమ్మపాలెం గ్రామానికి చెందిన రౌడీ షీటర్ ధరావత్ వినయ్ తన కోరిక తీర్చాలని అఘాయిత్యం చేయబోయాడు. ఆమె ప్రతిఘటించడంతో దాడికి పాల్పడ్డాడు. దీంతో మనస్తాపం చెందిన బాధితురాలు ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకుంది. స్థానిక రఘునాథపాలెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వినయ్‌పై నెల రోజు క్రితమే రౌడీ షీట్‌ ఓపెన్‌ కావడం గమనార్హం.

హైదరాబాద్‌ పాతబస్తీ ఐఎస్‌ సదన్‌లో రౌడీ షీటర్ నసీర్ కత్తితో హల్‌చల్‌ చేశాడు. ఈ నెల 1న జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. కత్తి చేతిలో పట్టుకుని వీధుల్లో తిరిగిన నసీర్‌.. పలు వాహనాలను ధ్వంసం చేశాడు. అడ్డొచ్చిన వారిపై దాడికి యత్నించాడు. హత్య, హత్యాయత్నం, చోరీ, చైన్ స్నాచింగ్‌ కేసుల్లో ఇతడు నిందితుడిగా ఉన్నాడు. ఈ మేరకు రౌడీ షీటర్‌గా పోలీస్ రికార్డుల్లోకి ఎక్కాడు.

వరంగల్ జిల్లా నర్సంపేట టౌన్‌లో ఓ రౌడీ షీటర్ ఇటీవల వీరంగం సృష్టించాడు. వల్లభ్ నగర్‌కు చెందిన కొంగ మురళి కుటుంబంపై రౌడీ షీటర్ ఓర్సు తిరుపతి తన అనుచరులతో వచ్చి వీరంగం సృష్టించాడు. దాడిలో మురళి కుమారుడు సాయి చేయి విరిగి, తల పగిలి రక్తస్రావం అయ్యింది. అడ్డుకునేందుకు వెళ్లిన మురళి భార్య నాగలక్ష్మి, కూతురు రేష్మ, అల్లుడు రాజు, సాయి భార్య ప్రత్యూషపై దారుణంగా దాడి చేశాడు. తిరుపతిపై ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు నమోదు కాగా, రౌడీ షీటర్‌గా పోలీసుల రికార్డుల్లోకి ఎక్కాడు.