భారత సైన్యంలో ‘భైరవ్’.. తొలి బెటాలియన్ రెడీ

భారత్ న్యూస్ ఢిల్లీ…..భారత సైన్యంలో ‘భైరవ్’.. తొలి బెటాలియన్ రెడీ

భారత సైన్యంలో ఆధునిక పరిజ్ఞానం, శక్తిమంతమైన ఆయుధాలతో శరవేగంగా స్పందించే ‘భైరవ్’ బెటాలియన్లు సిద్ధమవుతున్నాయి. నవంబర్ 1న తొలి బెటాలియన్ సైన్యంలో మోహరించనున్నట్లు భారత సైన్యం (పదాతిదళ) డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ అజయ్ కుమార్ వెల్లడించారు. వచ్చే ఆరు నెలల్లో ఇటువంటి 25 బెటాలియన్లను సిద్ధం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో భైరవ్ యూనిట్లో 250 మంది సుశిక్షిత జవాన్లు ఉండనున్నట్లు చెప్పారు.

“ఇప్పటికే ఐదు భైరవ్ బెటాలియన్లు ఏర్పాటయ్యాయి. వీటిని నిర్దేశించిన ప్రాంతాల్లో మోహరించారు. అక్టోబర్ 1 నుంచి శిక్షణ కొనసాగుతోంది. నెల చివరి నాటికి పూర్తవనుండగా.. తొలి బెటాలియన్ పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. మరో నాలుగు బెటాలియన్ల ప్రక్రియ కొనసాగుతోంది. రానున్న ఆరు నెలల్లో ఇటువంటివి 25 బెటాలియన్లను ఏర్పాటు కానున్నాయి” అని డైరెక్టర్ జనరల్ అజయ్ కుమార్ వెల్లడించారు.

భారత సైన్యంలోని ప్రత్యేక బలగాలకు, సంప్రదాయ పదాతిదళాల మధ్య ఉన్న అంతరాన్ని ఇవి భర్తీ చేస్తాయని సైనికాధికారులు చెబుతున్నారు. ఈ భైరవ్ యూనిట్లో 250 మంది సుశిక్షిత జవాన్లు, ఏడు నుంచి ఎనిమిది మంది అధికారులు ఉండనున్నారు. సంఖ్యాపరంగా చిన్నగా ఉన్నప్పటికీ చాలా శక్తిమంతమనే చెప్పవచ్చు. సాధారణ పదాతిదళ బెటాలియన్లు చేపట్టలేని, ప్రత్యేక బలగాల అవసరం లేని ఆపరేషన్లను భైరవ్ యూనిట్లు చేపడతాయి. రిస్కు అధికంగా ఉన్న, శత్రు భూభాగంలోకి రహస్యంగా లోతుగా చొచ్చుకెళ్లాల్సిన ఆపరేషన్లపైనే దృష్టిసారించేందుకు వీలవుతుంది.