ఏసీబీ వలలో..కమర్షియల్ తిమింగళం..!

భారత్ న్యూస్ విజయవాడ…ఏసీబీ వలలో..
కమర్షియల్ తిమింగళం..!

— నగదుతో పట్టుబడ్డ ఉద్యోగి
— వేధిస్తూ అక్రమ వసూళ్లు
— వాణిజ్య శాఖలో అలజడి

విజయవాడ: కమర్షియల్ ట్యాక్స్ శాఖలో ఏళ్లుగా పాతుకుపోయిన అవినీతి తిమింగళాన్ని ఏసీబీ అధికారులు గురువారం సాయంత్రం వలపన్ని పట్టు కున్నారు. వాణిజ్య పన్నుల శాఖ గవర్నర్ పేట డివిజన్లో ఒక సాధారణ అటెండర్ స్థాయిలో విధులు నిర్వహించే కొండపల్లి శ్రీనివాస్ తరచూ వ్యాపారులను బెదిరిస్తూ.. వారి వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులకు గతంలో అనేక మార్లు ఫిర్యాదులు అందాయి. పలు సందర్భాల్లో అతను ఏసీబీ అధికారులకు చిక్కినట్లే చిక్కి తృటిలో తప్పించుకున్నాడు. గురువారం సాయంత్రం సర్కిల్ ఆఫీసుకు సమీపంలోని అవంతి ట్రాన్స్ పోర్టు యజమానులను రైడ్ల సాకుగా వేధించి వేలల్లో నగదును వసూలు చేస్తుండగా కచ్చితమైన సమాచారంతో ఏసీబీ విజయవాడ డీఎస్పీ సుబ్బారావు ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ బృందాలు వలపన్ని పట్టుకున్నాయి.
అతని వద్దనుంచి 15 వేల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు, రసాయనిక పరీక్ష ద్వారా అవినీతి వసూళ్లకు పాల్పడుతున్నట్లు నిర్ధారించారు. వివిధ చోట్లకు వసూళ్ల నిమిత్తం తీసుకెళ్లే వాహనాన్ని సైతం స్వాధీనం చేసుకొని కేసునమోదు చేసి తమ అధీనంలోకి తీసుకున్నారు. డివిజన్ లో విధులు నిర్వహించే ఒక అధికారి అండదండలతో నిందితుడు వ్యాపారులను వివిధ కారణాలు సాకుగా చూపి పలు రకాలుగా వేధించడం ద్వారా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. గతంలో కూడా నిందితుడు ఇదే తరహా అక్రమ వసూళ్లకు పాల్పడుతూ 2017 ప్రాంతంలో ఏసీబీ అధికారులకు పట్టుబడి.. ఏడాది పాటు సస్పెన్షన్ వేటుకు గురైన్నపటికి, ఏ మాత్రం మార్పు రాకపోవడంపై సహచర ఉద్యోగులు పలు రకాలుగా చర్చించు కుంటున్నారు. గతంలో శాఖాపరమైన చర్యల్లో భాగంగా .. విధినిర్వహణలో భాగంగా గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే పరిమితం కావాలని నగర వ్యవహారాల్లో జోక్యం వద్దని రాత పూర్వకంగా హెచ్చరించినా వైఖరి మార్చు కోవడం లేదని సహోద్యోగులు వాపోతున్నారు. ఆ శాఖలోని కొందరు ఉన్నతాధికారుల రహస్య అందండలతో కొనసాగుతున్న ఈ అక్రమ వసూళ్లపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో శాఖాపరమైన సమగ్ర విచారణకు ఆదేశిస్తే .. వాస్తవాలు వెలుగులోకి వస్తాయని.. ఒకరు కొకరు వత్తాసు పలుకుతూ సాగిస్తున్న రహస్య లావాదేవీల గుట్టు రట్టవుతుందని పలువురు పేర్కొంటున్నారు. చాలా ఏళ్ల తరువాత అక్రమ వసూళ్ల వ్యవహారం ఏసీబీ దాడులతో వెలుగులోకి రావడంతో నగర పరిధిలోని వాణిజ్య పన్నుల శాఖలో గుబులు మొదలైంది~£