జాతీయ సదస్సు విజయవంతం – “హంతక రోబోలను నిలిపివేద్దాం”

.భారత్ న్యూస్ హైదరాబాద్….జాతీయ సదస్సు విజయవంతం – “హంతక రోబోలను నిలిపివేద్దాం”

హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం రోజున “హంతక రోబోలను నిలిపివేద్దాం – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆయుధాల నియంత్రణ” అనే అంశంపై జాతీయ సదస్సు ఘనంగా నిర్వహించబడింది.
ఈ సదస్సును భారత శాంతి, నిరాయుధీకరణ మరియు పర్యావరణ పరిరక్షణ సంస్థ (Indian Institute for Peace Disarmament and Environmental Protection – IIPDEP) మరియు నవభారత నిర్మాణ సంఘం సంయుక్తంగా నిర్వహించాయి.
సదస్సులో ముఖ్య అతిథిగా డా. రియాజ్ అలీ, చైర్మన్ – రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం పాల్గొని, శాంతి పరిరక్షణలో సాంకేతికతను మానవ విలువలకు అనుగుణంగా వినియోగించుకోవాలంటూ విలువైన సందేశాన్ని అందించారు.
ప్రధాన ఉపన్యాసకుడిగా మేజర్ జనరల్ ఎన్. శ్రీనివాసరావు ప్రసంగిస్తూ, భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆయుధాలు మానవ సమాజంపై కలిగించే ప్రభావాలను విశ్లేషించారు.
డా. బాలకృష్ణ కురవే, ప్రెసిడెంట్ – IIPDEP, సదస్సుకు అధ్యక్షత వహిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఆయుధ నియంత్రణపై కొనసాగుతున్న ఉద్యమాల గురించి వివరించారు.
కార్యక్రమానికి నవభారత నిర్మాణ సంఘం అధ్యక్షులు సూరేపల్లి రవికుమార్ మాట్లాడుతూ, సమాజ శ్రేయస్సు కోసం శాంతి భావజాలం అవసరమని పేర్కొన్నారు.
ఈ సదస్సులో కే. శంకర్‌రావు, పద్మిని సింగ్, అశోక్, రాజా, సునీల్, శ్రీలత రాణి,రాజేష్, ఉపేంద్ర గుప్తా, అరుణ జ్యోతి తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రజలు, విద్యార్థులు, శాంతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆయుధాలు మానవాళికి సవాలు విసురుతున్న నేపథ్యంలో ఈ సదస్సు ఆలోచనాత్మక చర్చలకు వేదికగా నిలిచింది.
ప్రముఖ సాహితీవేత్త, విమర్శకులు, పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత, ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫోరం సభ్యులు డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ తమ అభిప్రాయాన్ని ప్రకటించారు— “ప్రస్తుత ప్రపంచ వ్యవస్థలో కృత్రిమ మేధస్సు మానవ మేధస్సుపై ఆధిపత్యం సాధించే దిశగా పయనిస్తుండటం ఆందోళనకర పరిణామం. రోబోటిక్ యుద్ధాలు మానవ జాతి విలువలను ప్రశ్నించే స్థితికి తీసుకువెళ్తాయి. శాంతి, న్యాయం, మానవ హక్కుల పరిరక్షణలో సాంకేతికత మానవత్వానికి సేవచేసే విధంగా మారాలి. ఆయుధ నియంత్రణపై చైతన్య సదస్సులు సమాజాన్ని కొత్త ఆలోచనల దిశగా నడిపిస్తాయి” అని తెలిపారు.