..భారత్ న్యూస్ హైదరాబాద్….కర్ణాటక రాష్ట్రంలోని కర్ణాటక స్టేట్ పవర్ లిఫ్టర్స్ అసోసియేషన్ (KSPLA) ఆధ్వర్యంలో ఈ నెల 9 నుండి 12వ తేదీ వరకు బెంగళూరులో ఘనంగా నిర్వహించిన 32వ నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్స్ – 2025 పోటీల్లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీమతి పి.వి.ఎం. నాగజ్యోతి గారు అద్భుత ప్రతిభ కనబరిచి బహుముఖ విజేతగా నిలిచారు.
ఈ జాతీయ స్థాయి పోటీల్లో ఎనిమిది రాష్ట్రాలకు చెందిన సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. అందులో భాగంగా మాస్టర్స్ 72 కేజీల విభాగంలో పాల్గొన్న నాగజ్యోతి గారు డెడ్ లిఫ్ట్, బెంచ్ ప్రెస్, మరియు పుష్-పుల్ విభాగాల్లో అద్భుత ప్రదర్శన కనబరిచి పతకాల పరంపరను కొనసాగించారు.
బెంచ్ ప్రెస్ విభాగంలో ఒక గోల్డ్ మెడల్,
డెడ్ లిఫ్ట్ విభాగంలో ఒక గోల్డ్ మెడల్,
పుష్-పుల్ విభాగంలో ఒక సిల్వర్ మెడల్,
టోటల్ పవర్ లిఫ్టింగ్ విభాగంలో మరో గోల్డ్ మెడల్,
మొత్తం మూడు బంగారు పతకాలు మరియు ఒక రజత పతకం సాధించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు.
ఈ కార్యక్రమంలోని బహుమతి ప్రధానోత్సవానికి కర్ణాటక రాష్ట్ర ప్రఖ్యాత సినీ నటుడు అహింసా చేతన్, ప్రముఖ రైతు నాయకులు, మరియు కర్ణాటక రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.
హీరో అహింసా చేతన్ చేతుల మీదుగా బహుమతులు అందుకోవడం విశేషంగా నిలిచింది.

నేషనల్ స్థాయిలో ఇంతటి ప్రతిభ కనబరిచినందుకు నిర్వాహకులు, అధికారులు, మరియు సహపోటీదారులు శ్రీమతి నాగజ్యోతి గారిని హర్షాతిరేకాలతో అభినందించారు.
విద్యా రంగంలోనే కాక క్రీడా రంగంలోనూ తమ ప్రతిభను నిరూపించిన ఆమె యువతకు ఆదర్శంగా నిలిచారని వారు తెలిపారు