సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలి,

.భారత్ న్యూస్ అమరావతి..సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలిఉత్సవాలతో పర్యాటక శోభ

Ammiraju Udaya Shankar.sharma News Editor…అభివృద్ధితో పాటు ఆనందాన్ని అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

నాడు ఆందోళనమయం… నేడు ఆనందమయం

విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు

గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన డప్పు కళాకారులు

బందరు రోడ్డులో సాంస్కృతిక కవాతు తిలకించిన ముఖ్యమంత్రి

ఎక్స్ పో గ్రౌండ్సును సందర్శించిన సీఎం చంద్రబాబు

విజయవాడ :

సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుని భావితరాలకు అందివ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. విజయవాడలో గత 11 రోజుల నుంచి విజయవాడ ఉత్సవ్ పేరుతో జరుగుతున్న వివిధ కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. దసరా వేడుకల్లో భాగంగా చేపట్టిన సాంస్కృతిక సంబరాల్లో భాగంగా ఇందిరా గాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకూ సాంస్కృతిక కవాతు నిర్వహించారు. ఈ కవాతును ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. సుమారు 3 వేల మందితో వివిధ కళా రూపాలు, నృత్యాలతో భారీ ఎత్తున కవాతు జరిగింది. డప్పు కళాకారుల ప్రదర్శనకు గిన్నిస్ బుక్ రికార్డు దక్కింది. అనంతరం గొల్లపూడి ఎక్స్ పో గ్రౌండ్సులో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ముఖ్యమంత్రి సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఎక్స్ పోలో ఏర్పాటు చేసిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సుతో కూడిన రోబో కిచెన్ విశేషాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ”సంక్షేమం, అభివృద్ధి అవసరం… అదే సమయంలో మానసిక ఆనందం కూడా అవసరమే. మన సంస్కృతీ సంప్రదాయాలు కాపాడుకోవాలి. మానసికంగా ప్రజలకు ఉల్లాసం ఉండాలి. నృత్య రీతులు, సంగీతం, సాహిత్యం, కళలు అన్నీ మన సంస్కృతిలో భాగం. కనుమరుగవుతున్న ఇలాంటి కళల్ని కాపాడుకోవాలి. వారసత్వంగా వచ్చిన ఈ కళలను భావితరాలకు అందివ్వాలి. విజయవాడ ఉత్సవ్ లో భాగంగా 280కి పైగా ఈవెంట్లను నిర్వహించారు. 2.50 లక్షల మంది వీటిని వీక్షించారు. హెలీ రైడింగ్ సహా వేర్వేరు సాహస క్రీడల్ని కూడా నిర్వహించి విజయవాడ ఉత్సవ్ ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.” అని సీఎం అన్నారు.