తెలంగాణలోని యువతీ యువకులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాల అవకాశాలు కల్పిస్తుందని,

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….తెలంగాణలోని యువతీ యువకులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాల అవకాశాలు కల్పిస్తుందని, ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. నైపుణ్యత కలిగిన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనతో పాటు విదేశాల్లో ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవడానికి సహాయకారిగా ప్రభుత్వంలో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

రాష్ట్రంలోని ఐటీఐలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ATCs) మార్చిన నేపథ్యంలో మల్లేపల్లి ఐటీఐ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం నుంచి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా 65 ఏటీసీలను విర్చువల్‌గా ప్రారంభించారు.

మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారితో పాటు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి గారు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న మల్లేపల్లి ఏటీసీని పరిశీలించారు.

అనంతరం అక్కడ జరిగిన సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, నైపుణ్యం పెంచుకోవడానికి ప్రభుత్వం అన్ని అవకాశాలను కల్పిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకుని మంచి భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు.

“ఏటీసీల్లో చదువుకునే ప్రతి విద్యార్థికి ప్రతి నెలా 2000 రూపాయల స్టయిఫండ్ ఇస్తాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ స్టయిఫండ్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఇది ఖర్చు కాదు. భవిష్యత్తుకు పెట్టుబడి. పని చేయాలన్న సంకల్పం కావాలి. కష్టపడి పనిచేయాలి. మీకు ఉద్యోగావకాశాలు, పాస్‌పోర్టు తదితర సర్వీసును అందించడానికి ప్రభుత్వంలో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తాం. మీ భవిష్యత్తుకు పునాదులు వేస్తాం.

ఏటీసీల్లో శిక్షణ పొందిన తమ్ముళ్లు, చెల్లెళ్లు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగడంలో మీ వంతు కృషి చేయాలి. అభివృద్ధిని సాధించాలన్న సంకల్పంతోనే యువతలో సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.

రాష్ట్రంలో 1956 లో ప్రారంభమైన ఐటీఐలు, క్రమేణా 65 ఐటీఐలకు పెరిగినప్పటికీ గత ప్రభుత్వాలు వీటిని పట్టించుకోలేదు. మారిన కాలానికి ఈ కేంద్రాలు ఏమాత్రం సంబంధం లేకుండా పాతకాలపు ఒరవడిలో నడిచాయి.

వాటిని సమూలంగా మార్చి ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నైపుణ్యం కలిగిన శిక్షణ అందించాలన్న లక్ష్యంతో గత ఏడాది ఇదే ప్రాంగణంలో ఏటీసీలకు పునాదులు వేసుకున్నాం.

టాటా టెక్నాలజీస్ సహకారంతో రాష్ట్రంలో 65 ఐటీఐలను ఏటీసీలుగా మార్చడానికి ప్రభుత్వం కేవలం 300 కోట్లు ఖర్చు చేస్తే టాటా సంస్థ 2100 కోట్లు ఖర్చు చేసి ఆధునిక ఏటీసీలను తీర్చిదిద్దారు. మన వద్ద డబ్బుకన్నా ఆలోచన, చిత్తశుద్ది ఉండాలి. చిత్తశుద్ధి, సంకల్పం ఉంటే సాధ్యం కానిదంటూ ఏమీ లేదు.

ప్రస్తుతం 65 ఏటీసీలకు అదనంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో మరో 51 ఏటీసీలను ప్రారంభిస్తాం. ఈ 116 ఏటీసీలు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తాయి. ఒకప్పుడు ఐటీఐల్లో చదువుకున్న వారికి ఆర్టీసీలో అప్రెంటిస్ చేయడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ అప్రెంటిషిప్ ఇప్పించే ఏర్పాట్లు చేయాలి.

రాష్ట్రంలో ప్రతి ఏటా 1 లక్షా 10 వేల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ పట్టా పొందుతున్నప్పటికీ నైపుణ్యం లేని కారణంగా చాలా మందికి ఉద్యోగావకాశాలు రావడం లేదు. నైపుణ్యం లేనిదే ప్రైవేటు కార్పొరేట్ రంగంలో ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే స్కిల్స్ పెంచాలన్న అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ లాంటివి ప్రారంభించామంటే మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలన్నదే మా సంకల్పం.