…భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి భూ సేకరణ, పరిహారం చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. భూ సేకరణ విషయంలో మానవీయ కోణంలో వ్యవరించాలని, అదే సమయంలో రహదారుల నిర్మాణంతో కలిగే లాభాలను రైతులకు వివరించి ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం, అనుమతుల జారీ, నూతన ప్రతిపాదనలకు ఆమోదం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి గారు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI), జాతీయ రహదారుల విభాగం (NH), జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ (MoRTH), రహదారులు, భవనాల శాఖ (R&B, అటవీ శాఖ అధికారులతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
జాతీయ రహదారులకు నెంబర్ల కేటాయింపు, సూత్రప్రాయ అంగీకారం తెలుపుతున్నా, తర్వాత ప్రక్రియలో జరుగుతున్న జాప్యంపై ముఖ్యమంత్రి గారు ఆరా తీశారు. చిన్న చిన్న కారణాలతో పలు రహదారుల పనుల్లో జాప్యం జరగొద్దని, అలాంటి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. భూ సేకరణను పూర్తి చేయడమే కాకుండా పరిహారం తక్షణమే అందేలా చూడాలని చెప్పారు.
రీజినల్ రింగు రోడ్డు (RRR) ఉత్తర భాగం నిర్మాణానికి సంబంధించి కేంద్రం లేవనెత్తిన ప్రతి సందేహాలను నివృత్తి చేస్తున్నప్పటికీ కొత్త సమస్యలను ఎందుకు లేవనెత్తుతున్నారని ఎన్‌హెచ్ఏఐ అధికారులను ముఖ్యమంత్రి గారు ప్రశ్నించారు. సందేహాలన్నింటిని ఒకేసారి పంపాలని కోరినప్పుడు, ఎటువంటి సందేహాలు లేవని, ఏవైనా ఉంటే వెంటనే పంపుతామని ఎన్‌హెచ్ఏఐ అధికారులు తెలిపారు.
“ఆర్ఆర్ఆర్ దక్షిణ, ఉత్తర భాగాలు రెండు వేర్వురు ప్రాజెక్టులుగా చూడొద్దు. సౌత్‌కు కూడా నార్త్‌కు ఇచ్చిన నెంబర్‌ను కొనసాగించాలి. వెంటనే అనుమతులు మంజూరు చేసి ఏకకాలంలో రెండింటి పనులు ప్రారంభమయ్యేందుకు ఎన్‌హెచ్ఏఐ సహకరించాలి. ఆర్ఆర్ఆర్ సౌత్ అలైన్‌మెంట్‌కు వెంటనే ఆమోదముద్ర వేయాలి.
