భారత్ న్యూస్ తిరుపతి…మీ ఆరోపణల మీద సిబీఐ విచారణకు సిద్ధం – టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి ప్రతిసారీ వైయస్సార్సీపీ మీద విమర్శలు గుప్పించడం, ఆ తర్వాత పదిరోజులకు వాటిని నిరూపించలేక పూర్తిగా నిశ్శబ్దంగా మారిపోవడం పరిపాటిగా మారింది. అధికారంలోకి వచ్చి 15 నెలలు అయింది.. మా మీద ఇన్ని దఫాలుగా ఆరోపణలు చేస్తారు. అవి ఈనాడు పత్రికల్లో ప్రముఖంగా వచ్చేట్టు చేస్తారు. మీరంతా విషం లాంటి ఆ ప్రసాదాన్ని పంచడమే పనిగా పెట్టుకున్నారు. నిజంగా మా హయాంలో అక్రమాలు జరుగాయనుకుంటే సీబీఐ విచారణ చేయించడానికి మీకెందుకు భయం? సాక్షాత్తూ 120 కోట్ల మంది హిందువులకు ఆరాధ్యదైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి క్షేత్రంలో ఇంతటి ఘోరం జరిగిందని ఆరోపణలు చేసినప్పుడు… దానిపై సీబీఐ విచారణ చేయాలి ? జ్ఞానశూన్యమూర్ఖేష్ నారా లోకేష్ , భక్తిలేని రసరాయుడు బీ ఆర్ నాయుడు కలిసి భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పరకామణి చోరీ వ్యవహారం నడిచిందని ఆరోపించారు. నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ సంఘటన జరిగింది నిజమైతే నా తల అలిపిరిలో నరుక్కోవడానికి నేను సిద్దంగా ఉన్నాను. కాదు అని తేలితే వీరిద్దరూ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. నేను దేనికైనా సిద్దం.
● టీడీపీకి ఆటస్థలంగా స్వామివారి దివ్యధామం..

త్రైలోక్యనాధుడైన శ్రీ వెంకటేశ్వరస్వామి దివ్యధామాన్ని కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీకి సంబంధించిన సానుభూతిపరులకు ఆటస్థలంగా మార్చివేశారు. జరిగింది ఒకటైతే దాన్ని వక్రీకరించడమే కాకుండా చిలవలు, పలువలు చేసి తమ రాజకీయ స్వార్ధం కోసం స్వామి సన్నిధానాన్నే తమ స్వార్ధ క్షేత్రంగా మార్చివేస్తున్నారు. 29-04-2023 సంవత్సరంలో జీయర్ మఠానికి సంబంధించిన రవికుమార్ అనే వ్యక్తి పరకామణిలో చోరీ చేస్తుండగా.. విజిలెన్స్ అధికారులకు అతని దగ్గర 8 వంద డాలర్ల నోట్లు పట్టుకున్నారు. అలా పట్టుబడ్డ సొమ్ము విలువ ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.72 వేలు విలువ అని కూడా అధికారులు తేల్చారు. లోతైన పరిశీలన చేయడం ద్వారా అతను దాదాపు 20 ఏళ్లుగా ఈ రకంగా చేస్తున్నాడని మా పార్టీ నేతృత్వంలోని పాలకమండలి, అప్పటి అధికారులే దీన్ని బయటపెట్టారు. 20 ఏళ్లుగా చేస్తున్నాడని తేలింది అంటే 15 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడా ఈ రవికుమార్ చోరీ చేస్తున్నాడని తేటతెల్లం అయింది. రవికుమార్ ను పట్టుకున్నది మా ప్రభుత్వంలోని అధికారులే. పట్టుకున్న తర్వాత అతని శ్రీమతి, కుమార్తెలు జరిగిన ఘోర అపచారానికి, నేరానికి తమ భర్త మీద బాధతో దేవస్థానం అధికారులను సంప్రదించి.. చేసిన తప్పుకు పాపపరిహారంగా, ప్రాయశ్చిత్తంగా దేవుడికి కానుకగా.. రిజిస్ట్రేషన్ విలువ రూ.14 కోట్లుకాగా, మార్కెట్ లో రూ.100 కోట్ల విలువైన ఆస్తిని టీటీడీకి దఖలుపర్చారు. 19-06-2023లో వాళ్లు ఆస్తులు ఇచ్చిన ఆస్తులపై బోర్డు తీర్మానంలో ఆమోదించారు. అప్పుడు నేను టీటీడీ అధ్యక్షుడిగా లేను.