సీఎం రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….సీఎం రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చర్చించిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య హైదరాబాద్ లో మంగళవారం సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా
కాజీపేట రైల్వే స్టేషన్ ఎదుట నూతన మల్టీ మోడల్ ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం నిర్మాణానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కోరారు. ఈ బస్టాండ్ నిర్మాణం ద్వారా ప్రయాణీకులకు విశేష ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. భూపాలపల్లిలో రైల్వే స్టేషన్ ఏర్పాటు, భూపాలపల్లిని హసన్‌పర్తి రోడ్ లేదా భూపాలపల్లి జిల్లాకు దగ్గరగా ఉన్న ఉప్పల్, కమలాపూర్ రైల్వే స్టేషన్‌లకు అనుసంధానించే కొత్త రైల్వే లైన్ నిర్మాణంతో ప్రజా ప్రయోజనంతో పాటు ప్రాంతీయ అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇప్పటికే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని మరోసారి రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని సీఎం గారిని కోరారు. అలాగే నష్కల్ నుండి హసన్‌పర్తి మరియు చింతల్‌పల్లి నుండి నష్కల్ వరకు రెండు కొత్త రైల్వే బైపాస్ లైన్లను ప్రతిపాదించారని, ప్రతిపాదిత అలైన్‌మెంట్‌లు వరంగల్ మాస్టర్ ప్లాన్ 2041కి విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఈ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం గానీ కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KUDA) గానీ స్థానిక ప్రతినిధులను సంప్రదించకుండానే తయారు చేయబడ్డాయని ఎంపీ పేర్కొన్నారు. ప్రస్తుత ప్రతిపాదనలను పునఃపరిశీలించడం ద్వారా ORR ను ఆనుకుని రైల్వే మౌలిక సదుపాయాలను ప్లాన్ చేయాలని, అప్పుడు రైతుల సమస్య తీరుతుందని, ట్రాఫిక్‌ సమస్య ఉండదని, వరంగల్ నగర ప్రణాళికతో పాటు అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ అంశంపై కూడా గతంలో కేంద్ర రైల్వే మంత్రిని కలసి వినతి పత్రం సమర్పించినట్లు వెల్లడించారు. రైల్వే అలైన్మెంట్ మార్పు విషయం వెంటనే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఎంపీ సీఎం గారికి విజ్ఞప్తి చేసారు.

వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఎంతో గొప్ప చారిత్రాత్మక దేవాలయాలైన శ్రీ భద్రకాళి ఆలయం, వేయి స్తంభాల ఆలయం తో పాటు చిల్పూర్ శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయం యొక్క సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ పథకం సహకరించాలని, కేంద్ర ప్రభుత్వంతో వీలైనంత త్వరగా ఆలయాల అభివృద్ధిపై చర్చించి, అవసరమైన నిధులను త్వరగా మంజూరు చేసే విధంగా చూడాలని కోరారు. వరంగల్ జిల్లా పరిధిలో ఉన్న చారిత్రాత్మకమైన దేవాలయాలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని, అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కోటగుల్లు (ఘణపూర్ దేవాలయాన్ని), నాపాక, రెడ్డి గుడి దేవాలయాల పునరుద్ధరణను వేగవంతం చేయాలని సీఎం గారిని కోరారు.
ఈ మేరకు సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి గారు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి వినతిపత్రం అందజేస్తామని తెలియజేసారు.