భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….నిజాం రాజు.. తలొగ్గిన రోజు
- అవిగవిగో మోహరించిన యుద్ధ ట్యాంకులు
- భారత సైనికుల కవాతు అల్లదిగో..
- స్వేచ్ఛా వాయువులు వీచిన క్షణాలవిగో
- నీలాకాశంలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం
- నిజాం నిరంకుశ పాలనకు చరమ గీతం
- 1948 సెప్టెంబరు 17న దేశంలో భాగమైన హైదరాబాద్ సంస్థానం
అదిగో సుశిక్షితులైన సైనికుల కవాతు.. వినీలాకాశంలో సమున్నతంగా రెపరెపలాడిన త్రివర్ణ పతాక దృశ్యం అదిగో.. హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించిన భారత సైనికులకు నీరాజనాలు పలుకుతున్న జనుల జయజయ ధ్వానాలవిగో.. 1948 సెప్టెంబరు 17న భాగ్యనగరంలో కనువిందు చేసిన దృశ్యం ఇది. నిజాం నిరంకుశ, రాచరిక పాలనకు చరమగీతం పాడిన రోజు ఇది.
రజాకారుల అకృత్యాలతో నలిగిపోయిన ప్రజలు ఈ రోజు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. ఆనందోత్సాహాలతో వేడుకలు చేసుకున్నారు. భారత యూనియన్ బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ పోలో’ విజయవంతమై నిజాం నిరంకుశ పాలన అంతమైన ఆ రోజుపై భిన్నాభిప్రాయాలు, విభిన్న దృక్పథాలు ఉన్నప్పటికీ హైదరాబాద్ సంస్థానం సువిశాలమైన భారత యూనియన్‌లో భాగమైంది. ఒక నవ శకం ప్రారంభమైంది.
ఆ రోజు ఏం జరిగిందంటే..
ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిణామాలు వేగంగా జరిగాయి. భారత సైన్యం అన్ని వైపుల నుంచి నగరానికి చేరువైంది. హైదరాబాద్ ప్రధాని లియాఖత్ ఉదయమే తన పదవికి రాజీనామా చేశారు. ఓటమి అనివార్యమని నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు తెలిసిపోయింది. కేఎం మున్షీని కింగ్‌కోఠికి పిలిపించాడు. ‘పోలీసు చర్యను ఆహ్వానిస్తూ భద్రతా సమితికి ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని’ మున్షీ సూచించారు. ఈ మేరకు రేడియోలో ప్రసంగించాలని కోరారు. అందుకు నిజాం అంగీకరించాడు.
కానీ.. అప్పటి వరకు రేడియోలో ప్రసంగించిన అనుభవం లేని నిజాం నవాబు దక్కన్ రేడియో స్టేషన్‌కు వెళ్లి తన లొంగుబాటును ప్రకటించాడు. అదే రోజు నిజాం సైన్యాధ్యక్షుడు ఇద్రూస్, భారత సైనిక బలగాల కమాండర్ జేఎన్ చౌధురి ఒక నిర్ణీత ప్రదేశంలో కలుసుకున్నారు. ‘బేషరతుగా లొంగిపోతున్నట్లు’ ఇద్రూస్ ప్రకటించాడు. ఆ తర్వాత ఇద్దరూ పరస్పరం కరచాలనం చేసుకున్నారు. చౌధురి జట్కా బండి నగరంలోకి పరుగులు తీసింది.
జనం జేజేలు..
నిజాం నవాబు భారత ప్రభుత్వానికి లొంగిపోతున్నట్లు ఉదయం నుంచే వార్తలు వెలువడ్డాయి. అప్పటి వరకు ఏ క్షణంలో ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియని భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ ఇళ్లలో గడిపిన నగరవాసులు.. నెమ్మదిగా వీధుల్లోకి వచ్చారు. సికింద్రాబాద్‌తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లోని రహదారులన్నీ జనంతో నిండిపోయాయి. భారత సైనికులకు స్వాగతం పలుకుతూ జేజేలు పలికారు.
వేలాదిగా తరలి వచ్చిన జనంతో పరేడ్ గ్రౌండ్స్ జనసంద్రమైంది. త్రివర్ణ పతాకలు రెపరెపలాడాయి. ‘మహాత్మా గాందీకి జై’, పండిట్ నెహ్రూ జిందాబాద్, సర్దార్ పటేల్ జిందాబాద్, భారత్‌మాతాకీ జై’ అంటూ జనం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘రజాకార్ ముర్దాబాద్’ అనే నినాదాలు ప్రతిధ్వనించాయి. బొల్లారం నుంచి భారత సైనిక బలగాలు పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకున్నాయి. మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాచరిక పాలన 1948 సెప్టెంబరు 17వ తేదీతో అంతమైంది.
ఐదు రోజుల పోలీసుచర్య…
హైదరాబాద్ సంస్థానంపై భారత ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్య సెప్టెంబరు 13వ తేదీ సోమవారం తెల్లవారుజామున ప్రారంభమైంది. లెఫ్ట్‌నెంట్ జనరల్ మేజర్ రాజేంద్రసింగ్ నేతత్వంలో మేజర్ జనల్ జె.ఎన్.చౌధురి దీనికి సారథ్యం వహించారు. భారత సైన్యం నలు వైపుల నుంచి హైదరాబాద్ భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. షోలాపూర్ నుంచి బయలుదేరిన సైన్యం నల్దుర్గ్ కోటను స్వాదీనం చేసుకొని తల్ముడి, తుల్జాపూర్ మీదుగా హైదరాబాద్ వైపునకు వచ్చింది.
మేజర్ జనరల్ డీఎస్ బ్రార్ ముంబై నుంచి, ఆపరేషన్ కమాండర్ మేజర్ జనరల్ ఎ.ఎ. రుద్ర విజయవాడ వైపు నుంచి బ్రిగేడియర్ శివదత్త బేరార్ నుంచి బయలుదేరారు. అన్ని వైపుల నుంచి భారత సైన్యం హైదరాబాద్‌ను ముట్టడించింది. భారత వైమానిక ఎయిర్ మార్షల్ ముఖర్జీ సైతం తన సేవలను అందజేసేందుకు సన్నద్ధమయ్యారు. దీంతో నిజాం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
1948 సెప్టెంబరు 14న దౌలతాబాద్, జల్నా, ఔరంగాబాద్, ఉస్మానాబాద్, నిర్మల్, సూర్యాపేట్, వరంగల్, ఖమ్మం ప్రాంతాలను సైన్యం తన స్వాదీనంలోకి తీసుకుంది. లాతూర్, జహీరాబాద్ ప్రాంతాల్లో నిజాం సైనికులపై భారత సేనలు బాంబుల వర్షం కురిపించాయి. సెప్టెంబరు 16న రాంసింగ్ నేతృత్వంలోని సైనికులు జహీరాబాద్‌ను ఆక్రమించుకున్నారు. షోలాపూర్ నుంచి హైదరాబాద్ వరకు యూనియన్ సైనికుల పాదాక్రాంతమైంది.
నిజాం సైనికులు బీబీనగర్, పటాన్చెరు, గచ్చిబౌలి, లింగంపల్లి, మల్కాపూర్ తదితర ప్రాంతాల్లో మందుపాతరలు పేల్చి సైన్యాన్ని అడ్డుకొనేందుకు విఫలయత్నం చేశారు. సైన్యం మరింత ముందుకు చొచ్చుకొని వచ్చింది. నిజాం సైన్యాధికారి ఎల్ ఇద్రూస్ చేతులెత్తేశారు. సెప్టెంబరు 17 సాయంత్రం 5 గంటలకు భారత సైనికులు హైదరాబాద్‌లోకి ప్రవేశించారు.
ఇదీ హైదరాబాద్ సంస్థానం..
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్రకారం 1937లో అనేక ప్రావిన్స్‌లలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ప్రభావం హైదరాబాద్ సంస్థానంపై పడింది. ‘బాధ్యతాయుతమైన ప్రభుత్వం కావాలని’ ఆంధ్ర మహాసభ మొదటిసారిగా రాజకీయ డిమాండ్‌ను బాహాటంగా ప్రకటించింది. ఆంధ్ర మహాసభ స్ఫూర్తితో కన్నడ పరిషత్, మహారాష్ట్ర పరిషత్ కూడా ఏర్పడ్డాయి. హైదరాబాద్ సంస్థానంలో కాంగ్రెస్ ప్రారంభమైంది….
ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంతో పాటు, మహారాష్ట్ర, కర్ణాటకలోని హైదరాబాద్ సంస్థానం విస్తీర్ణం సుమారు 1,41,133 చదరపు కిలోమీటర్లు.
చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్. ఆయన కింద 975 మంది జాగీర్దార్లు ఉండేవారు. వీరి అదీనంలో సాగుకు అనుకూలమైన 53,106 చదరపు కిలోమీటర్ల భూమి ఉండేది.
1921 నవంబర్‌లో ఆంధ్ర మహాసభ ఏర్పాటైంది. రాజకీయ సంబంధమైన ఒక సంస్థ నిజాం సంస్థానంలో ఏర్పడడం ఇదే మొదటిసారి. 1923లో ఆర్య సమాజ్ హైదరాబాద్ శాఖ ఏర్పాటు చేశారు.
