పీపుల్ సెంట్రిక్ గా ఉండాలి

భారత్ న్యూస్ గుంటూరు…పీపుల్ సెంట్రిక్ గా ఉండాలి

గుంటూరు, సెప్టెంబరు 13 : జిల్లా యంత్రాంగం ప్రజా కేంద్రీకృతంగా (పీపుల్ సెంట్రిక్) గా ఉండాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారీయా పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా నూతన కలెక్టర్ గా శనివారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా అధికారులతో జరిగిన సమావేశంలో తన మనోగతాన్ని స్పష్టం చేశారు. జిల్లా యంత్రాంగం చక్కటి టీమ్ వర్క్ తో పనిచేయాలని ఆమె పేర్కొన్నారు. టీమ్ వర్క్ తో పనిచేసినపుడు సాధ్యం కానిది లేదని ఆమె అన్నారు. ప్రతి లక్ష్యంను సాధించాలని ఆమె చెప్పారు. ప్రజల కేంద్రీకృతంగా పాలన సాగుతుందని, అధికారులు ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండాలని ఆమె ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె అన్నారు. పి.జి.ఆర్.ఎస్ కు ప్రభుత్వం కూడా ప్రాధాన్యత ఇస్తున్న సంగతిని ఆమె గుర్తుచేసారు. పి.జి.ఆర్.ఎస్ లో వచ్చే వినతులలో మన పరిధిలో పరిష్కారం చేయలేనివి వచ్చినపుడు స్పష్టంగా అర్జీదారుకు తెలియజేయాలని ఆమె ఆదేశించారు. కొన్ని సందర్భాల్లో ఎక్కువ సార్లు రీ ఓపెన్ జరుగుతున్నాయని, అటువంటి పరిస్థితులు ఉండకుండా క్షేత్ర స్థాయిలో పర్యటించి స్పష్టంగా విచారణ చేసి పరిష్కరించాలని ఆమె అన్నారు. విజన్ ఆంధ్రా కార్యాచరణ ప్రణాళికను అన్ని రంగాలకు తయారు చేయడం జరిగిందని, వాటిని తప్పకుండా సాధించుటకు కృషి చేయాలని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన కి పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ పై ప్రతి ఒక్కరికి సంపూర్ణ అవగాహన ఉండాలని ఆమె అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజల దృక్పథం ఏ విధంగా ఉందో ప్రజల నుంచి స్పందనను వివిధ మాధ్యమాల ద్వారా సేకరిస్తుందని అన్నారు. ప్రతి అంశాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని ఆమె చెప్పారు. జిల్లాను అభివృద్ధి పథంలో ఉన్నతంగా ఉంచుటకు సమష్టి కృషితో సాధ్యమని, అందుకు సానుకూల దృక్పథంతో అధికారులు పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస రావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.