భారత్ న్యూస్ ఢిల్లీ…..అమెరికాలో భారతీయుడి తల నరికిన అక్రమ వలసదారు !
అమెరికాలోని డల్లాస్ కౌంటీలోని శామ్యూల్ బౌలేవార్డ్‌లోని డౌన్‌టౌన్ సూట్స్ మోటెల్‌లో చంద్ర మౌళి నాగమల్లయ్య అనే భారతీయుడ్ని క్యూబాకు చెందిన అక్రమ వలసదారు దారుణంగా హత్య చేశాడు. అతని పేరు యోర్డానిస్ కోబోస్-మార్టినెజ్. నాగమల్లయ్య మోటెల్ మేనేజర్ గా పని చేస్తున్నారు. హంతకుడు మోటెల్‌లో ఓ వాషింగ్ మెషిన్ ను వాడుకునే ప్రయత్నం చేసినప్పుడు మహిళా ఉద్యోగి.. ఆ వాషింగ్ మెషిన్ పని చేయడం లేదని చెప్పడంతో అతను దురుసుగా ప్రవర్తించాడు.
దాంతో మేనేజర్ గా ఉన్న నాగమల్లయ్య సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే హంతకుడు చాలా నేరమనస్థత్వం ఉన్నవాడు కావడంతో గొడవను అంతకంతకూ పెంచుకుంటూ పోయాడు. గొడవ జరుగుతున్న సంగతి తెలిసి… అక్కడే ఉంటున్న నాగమల్లయ్య భార్య, పిల్లలు కూడా వచ్చారు. వారి ముందే మార్టినెజ్ కత్తి తీసుకొని నాగమల్లయ్యపై దాడి చేసి, మోటెల్ ఫ్రంట్ ఆఫీస్ వరకు వెంబడించాడు. నాగమల్లయ్య భార్య , కుమారుడు ఆపడానికి ప్రయత్నించినప్పటికీ నాగమల్లయ్య తలను నరికి, ఆ తలను పార్కింగ్ లాట్‌లో విసిరేశాడు. తర్వాత చెత్తబుట్టలో పడేశాడు.

ఇదంతా వీడియో కెమెరాల్లో రికార్డు అయింది. హంతకుడు కోబోస్-మార్టినెజ్‌ను పోలీసులు వెంటనే అరెస్టు చేశారు. రక్తంతో నిండిన దుస్తులు , కత్తి, నాగమల్లయ్య సెల్ ఫోన్, కీ కార్డ్ ను అతని నుంచి స్వాధీనం చేసుకున్నారు. విచారణలో హత్యను అంగీకరించాడు. అయితే మార్టినెజ్ అమెరికన్ కాదు. క్యూబన్. అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించాడు. అతని పేరు డిపోర్టు చేసే జాబితాలో ఉంది. పైగా గతంలో చాలా నేరాల్లో నిందితుడిగా ఉన్నాడు.