చంద్రబాబు దేంట్లోనైనా దూకి చావాలి: జగన్

భారత్ న్యూస్ మంగళగిరి…చంద్రబాబు దేంట్లోనైనా దూకి చావాలి: జగన్

చంద్రబాబు నియోజకవర్గంలో కూడా రైతులు ఎరువుల కోసం బారులు తీరుతున్నారన్న జగన్

ప్రభుత్వం బ్లాక్ మార్కెట్‌ను ప్రోత్సహిస్తోందని మండిపాటు

మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ధ్వజం

రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల కొరతపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా రైతులు ఎరువుల కోసం బారులు తీరడం సిగ్గుచేటని, ఈ అవమానం భరించలేక ఆయన దేంట్లోనైనా దూకి చావొచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? అనే సందేహం కలుగుతోందని విమర్శించారు.

ప్రభుత్వం కావాలనే ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి, బ్లాక్ మార్కెట్‌ను ప్రోత్సహిస్తోందని జగన్ ఆరోపించారు. తమ ఐదేళ్ల పాలనలో ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కిన పరిస్థితి ఎన్నడూ లేదని గుర్తు చేశారు. “గత రెండు నెలలుగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి సమస్యలపై పోరాడేందుకు మా పార్టీ ఆధ్వర్యంలో ‘అన్నదాత పోరు’ కార్యక్రమం నిర్వహించి ఆర్డీవోలకు వినతి పత్రాలు ఇస్తే, అర్ధరాత్రి పోలీసులు వచ్చి మా నేతలకు నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. రైతుల కోసం పోరాడటం తప్పా?” అని జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు.

రాష్ట్రంలో పాలన ప్రజల కోసం కాకుండా దోపిడీదారుల కోసం సాగుతోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానంలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను ప్రైవేటు వ్యక్తుల దోపిడీకి అప్పగించేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దేశంతో పోలిస్తే తిరోగమనంలో ఉందని, ‘రెడ్ బుక్’ పాలనలో ప్రజలు తమ గొంతు విప్పే స్వేచ్ఛ కూడా కోల్పోయారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. కనీస బాధ్యతలను కూడా ప్రభుత్వం విస్మరించిందని ఆయన విమర్శించారు.