మ్యాట్రిమోనీలో పరిచయం.. బిట్ కాయిన్ పేరుతో యువతి వల.. రూ. 27 లక్షలకు పైగా స్వాహా!

భారత్ న్యూస్ మచిలీపట్నం……మ్యాట్రిమోనీలో పరిచయం.. బిట్ కాయిన్ పేరుతో యువతి వల.. రూ. 27 లక్షలకు పైగా స్వాహా!

📍మ్యాట్రిమోనీ సైట్‌లో యువకుడికి ఓ మహిళతో పరిచయం

లండన్‌లో ఉంటున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించిన వైనం

బిట్ కాయిన్ ట్రేడింగ్‌లో భారీ లాభాలంటూ ఆశ

విడతలవారీగా రూ. 27.50 లక్షల పెట్టుబడి పెట్టిన యువకుడు

రూ.1.34 కోట్ల లాభం వచ్చిందని నమ్మించి, విత్‌డ్రాకు కమీషన్ డిమాండ్

డబ్బు ఇవ్వకపోవడంతో అకౌంట్ బ్లాక్.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు

పెళ్లి చేసుకుంటానని మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ ద్వారా పరిచయమైన మహిళ మాటలు నమ్మి ఓ యువకుడు భారీగా మోసపోయాడు. బిట్ కాయిన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు వేసిన వలలో చిక్కి ఏకంగా రూ. 27.50 లక్షలు పోగొట్టుకున్నాడు. హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం చాంద్రాయణగుట్టకు చెందిన యువకుడికి ఓ ప్రముఖ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో యువతి పరిచయమైంది. తాను చెన్నైకి చెందిన వ్యక్తినని, ప్రస్తుతం లండన్‌లో నివసిస్తున్నానని చెప్పింది. కొంతకాలం మాట్లాడుకున్న తర్వాత ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే అదనుగా భావించిన ఆ యువతి బిట్ కాయిన్ ట్రేడింగ్ ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని అతడికి ఆశ చూపింది.

తనకు తెలిసిన ఒక ట్రేడింగ్ వెబ్‌సైట్‌లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు ఆర్జించవచ్చని నమ్మబలికింది. ఆమె మాటలు పూర్తిగా విశ్వసించిన బాధితుడు సైబర్ నేరగాళ్లు సూచించిన ప్లాట్‌ఫాంలో చేరాడు. ట్రేడింగ్ ప్రారంభించడానికి కనీసం రూ. 27.50 లక్షలు పెట్టుబడిగా పెట్టాలని వారు సూచించడంతో ఆ యువకుడు అప్పులు చేసి, రుణాలు తీసుకుని వారు చెప్పిన వేర్వేరు బ్యాంకు ఖాతాలకు ఆ మొత్తాన్ని బదిలీ చేశాడు.

డబ్బులు బదిలీ చేసిన కొన్ని రోజులకే అతడి పెట్టుబడికి రూ. 1.34 కోట్ల లాభం వచ్చినట్లు వెబ్‌సైట్‌లో చూపించారు. ఆ డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా అసలు మోసం బయటపడింది. లాభం పొందినందుకు 10 శాతం కమీషన్‌గా మరో రూ. 13.47 లక్షలు చెల్లించాలని సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేశారు. బాధితుడు అంత మొత్తం చెల్లించలేకపోవడంతో వారు అతని ట్రేడింగ్ ఖాతాను బ్లాక్ చేశారు. తాను మోసపోయానని గ్రహించిన యువకుడు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.