భారత్ న్యూస్ అనంతపురం….చిక్కుల్లో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి!
అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై హైకోర్టు తాజాగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇంకా ఎందుకు అరెస్టు చేయకుండా నానుస్తున్నారు అంటూ ఎమ్మెల్యేను ఉద్దేశించి చేసిన విమర్శలు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పై గతంలో హత్య కేసు నమోదయింది. ఈ కేసులో తన ప్రమేయం లేదని ఆయన చెబుతున్నప్పటికీ ఆధారాలు ఉన్నాయి అని పోలీసులు కేసు నమోదు చేశారు.
దీనిపై స్టే కోరుతూ ఇప్పటికే 7 సార్లు ఆయన హైకోర్టును ఆశ్రయించడం, ఆరుసార్లు స్టే ఇవ్వడం జరిగాయి. ఇప్పుడు ఏడోసారి ఈ కేసులో స్టే కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యే అయినంత మాత్రాన కేసుల నుంచి బయట పడలేరని, హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని అసలు రాజకీయాల్లోకి ఎలా తీసుకున్నారని కూడా హైకోర్టు ప్రశ్నించింది. ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు దీనికి ఏం చెప్తారు అని కూడా నిలదీసింది.
ఇక.. స్టే ఇవ్వాలా వద్దా అనే అంశాన్ని పరిశీలిస్తామని ఇప్పటికి ఎప్పుడు స్టే ఇవ్వలేమని పేర్కొంటూ రెండు రోజుల కిందట కేసు వాయిదా వేసింది. దీంతో ఏం జరుగుతుందనేది ఇప్పుడు టిడిపి నాయకులలోను ఎమ్మెల్యే అనుచరులలోను చర్చ జరుగుతోంది. వాస్తవానికి హత్య కేసులు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రాష్ట్రంలో కొందరు ఉన్నారు. అయినప్పటికీ వెంకటేశ్వర ప్రసాద్ పై హైకోర్టు ఎంత తీవ్రంగా స్పందించేసరికి టిడిపి నాయకులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు.
రేపు ఈ కేసులో స్టే కనక ఇవ్వకపోతే ఆయనను అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నప్పటికీ రాజకీయంగా ఇది టిడిపికి ఇబ్బందికర పరిస్థితి తీసుకొచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికి ఇప్పుడైతే దగ్గుబాటి చుట్టూ ఈ కేసు తీవ్ర ప్రభావమే చూపిస్తుంది. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. మరోవైపు పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఈ కేసుపై మంతనాలు చేస్తున్నారు. సీనియర్ లాయర్లను నియమించాలని కూడా చెప్పినట్టు తెలిసింది.
