భారత్ న్యూస్ విశాఖపట్నం.Ammiraju Udaya Shankar.sharma News Editor….సెప్టెంబర్ నెలాఖరకు నల్లబర్లీ పొగాకు కొనుగోళ్లు పూర్తి అవ్వాలి
- మార్క్ ఫెడ్ అధికారులను & తోబాకో కంపెనీలను ఆదేశించిన వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి, సెప్టెంబర్ 3 : రాష్ట్రంలో రైతులు పండించిన నల్లబర్లీ పొగాకు కొనుగోళ్లు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని, సెప్టెంబర్ నెలాఖరకు నల్ల బర్లీ పొగాకు కొనుగోళ్లు పూర్తి అవ్వాలని మార్క్ ఫెడ్ అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. బుధవారం వెలగపూడి సచివాలయంలోని ఐదవ బ్లాక్ లో వ్యవసాయ శాఖ, అనుబంద శాఖల ఉన్నతాధికారులతో పొగాకు, ప్రత్తి కొనుగోళ్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రైతు శ్రమ వృథా కాకుండా, మార్కెట్లో సమయానికి పంట కొనుగోళ్లు జరిగేలా ప్రభుత్వ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. రైతు ప్రయోజనం దృష్టిలో పెట్టుకుని పారదర్శకంగా కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వాణిజ్య కేంద్రాల్లో ఎటువంటి అవినీతి, ఇబ్బందులు చోటుచేసుకోకుండా ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను నియమించామని, రైతు శ్రేయస్సే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత అని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
రాష్ట్రంలో నల్లబర్లీ పొగాకును 80 మిలియన్ కిలోలు పండించటం జరిగిందని, ఇప్పటివరకు 22 కంపెనీలు 40 మిలియన్ కిలోలు కొన్నారని, అదే విధంగా 15 మిలియన్ కిలోలు ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు జరిగిందని తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 55 మిలియన్ కిలోలు కొనడంతో ఇంకా 20 మిలియన్ కిలోలు ప్రయివేట్ కంపెనీ వారు అత్యవసరంగా ఈ నెల చివరి లోగా కొనాలని ఆదేశించారు. మిగిలిన 5 కిలోలు మార్క్ ఫెడ్ కొనుగోలు చేస్తుందన్నారు.
2025-26 రబి సీజన్ లో నల్లబెర్లి పొగాకు ను ఎవరు పండించకూడదని ఇందుకోసం 740 జీవో విడుదల చేసామన్నారు. కంపెనీలతో ఎంఓయీలు చేసుకున్న రైతులు మాత్రమే తెల్ల బర్లీ పోగాకును పండించాలని అన్నారు. నల్ల బర్లీ పంటను వేయకుండా రైతులు శనగలు, మినుములు, పెసలు, జొన్నలు, మొక్కజొన్న వంటి పంటలను వేయాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు.
ఖరీఫ్ సీజన్లో పండించే ప్రత్తి కొనుగోలుపై సీసీఐ దృష్టి సారించాలి
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో ప్రత్తి సాధారణ సాగు విస్తీర్ణం 5.28 లక్షల హెక్టార్లు కాగా 4.02 లక్షల హెక్టార్లలో పంట సాగు చేయబడిందని మరియు దాదాపు 7.12 లక్షల మెట్రిక్ టన్నుల ప్రత్తి దిగుబడి అంచనా వేశామన్నారు.
ఖరీఫ్ సీజన్లో పండినటువంటి ప్రత్తి పంటను కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) కనీస మద్దతు ధర కలిగేలా రైతుల వద్ద ప్రత్తిని కొనుగోలు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అక్టోబర్ 1 నాటికి సిసిఐ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఇందుకోసం తగిన చర్యలను చేయాలని అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు.
