భారత్ న్యూస్ గుంటూరు …Ammiraju Udaya Shankar.sharma News Editor…సోషల్ మీడియాలో విపరీత పోకడలను నిలువరించాలి
• ప్రభుత్వంపైనా, పాలనలో ఉన్నవారిపైనా దుష్ప్రచారం చేస్తున్నారు
• మహిళపట్ల అభ్యంతరకర రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారు
• సోషల్ మీడియాలో వికృత ధోరణిపై అసెంబ్లీలో చర్చించి ప్రత్యేక చట్టం తేవాలి
• రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి స్ఫూర్తిని నిలబెట్టాలి
• చట్ట సభల్లో సమష్టిగా అన్ని అంశాలపై మాట్లాడాలి
• అపరిష్కృతంగా ఉన్న నియోజకవర్గాల సమస్యలను నా దృష్టికి తీసుకురండి
• జనసేన పార్టీ లెజస్లేటివ్ సమావేశంలో మాట్లాడిన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు

‘సోషల్ మీడియాలో మహిళలపై జుగుప్సాకరంగా జరుగుతున్న దాడిని అడ్డుకునేలా జనసేన పార్టీ ప్రజాప్రతినిధులు అసెంబ్లీ వేదికగా మాట్లాడాల’ని జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. దీనిపై అంతా సమష్టిగా అసెంబ్లీలో చర్చించి ఓ ప్రత్యేకమైన చట్టం లేదా ఆర్డినెన్స్ తీసుకువచ్చేలా పనిచేద్దామని చెప్పారు. దీనిపై నిపుణులతో ప్రత్యేకంగా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి సూచనలు తీసుకుందామన్నారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో భాగంగా విశాఖ వేదికగా మొదటి రోజు జరిగిన పార్టీ లెజిస్లేటివ్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులను ఉద్దేశించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… ప్రభుత్వంపైనా, పాలనలో ఉన్నవారిపైనా దుష్ప్రచారం చేస్తున్నారు. మహిళపట్ల అభ్యంతరకర రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వికృత ధోరణిపై అసెంబ్లీలో చర్చించి ప్రత్యేక చట్టం తేవాలి అన్నారు. జనసేన విజయానికి 2024 ఎన్నికలు ఆరంభం మాత్రమే అని, ఈ గెలుపు నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నిరాటంకంగా కొనసాగుతుందని జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉద్ఘాటించారు. సైద్ధాంతిక బలాన్ని నేను నమ్ముతాను. అటువంటి సిద్ధాంతాల ఆధారంగా ఆవిర్భవించిన జనసేనకు ప్రజలు భావజాలంతో కనెక్ట్ అయ్యారు. దీనికి జనసేనలో అపారంగా ఉన్న యువశక్తే కారణమని వెల్లడించారు. పార్టీని ముందుకు తీసుకువెళ్లడంలో యువతదే కీలక పాత్ర అని, వారికి అండగా, ఆలంబనగా నాయకులంతా నిలబడాలని పిలుపునిచ్చారు. ఈ రోజు ఉదయం విశాఖ వేదికగా జరిగిన జనసేన లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ లో అధ్యక్షోపన్యాసం చేశారు. 2014 పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు పార్టీ పరంగా కొనసాగిన ప్రయాణాన్ని ఆయన మరోసారి గుర్తు చేశారు. పార్టీ ఆవిర్భవించి ఒక దశాబ్దం పూర్తయ్యింది. ఈ దశాబ్దకాలంలో లక్షలాది మందితోనూ, ఈ సీజన్ లో 10 వేల మందితో ముఖాముఖిగా మాట్లాడి ఉంటాను. ప్రజలకు, పార్టీకి మధ్య సైద్ధాంతిక వారధి ఉన్న కారణంగా భవిష్యత్తంతా జనసేనదేనని ఆయన స్పష్టం చేశారు. జన సైనికులు భావావేశం, ఆలోచన ఉన్న వారు. యువత సామర్ధ్యాన్ని ఎవరూ తక్కువగా అంచనా వేయకూడదు. ముమ్మాటికీ జనసేన బలం యువతే. ఈ పార్టీ ప్రారంభించినప్పుడు కొందరు రాజకీయవేత్తలు, విశ్లేషకులు ఈ పార్టీని నడపలేరు అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు వారే జనసేన సాధిస్తున్న విజయాలను చూసి తమ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నారు.
నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా ఒక స్పష్టమైన ఆలోచన, అవగాహనతో ఒక పరిధిలో మాత్రమే మాట్లాడుతాను. నా ఆలోచనలు, నా మాటలు, నా భావాలకు యువత కనెక్ట్ అవుతారు. అందుకే నా వెంట యువత నడుస్తారు. జనవాణి నిర్వహించడానికి విశాఖ నగరానికి వచ్చినప్పుడు నాటి వైసీపీ ప్రభుత్వం చేపట్టిన దమనకాండ, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడు గారిని అరెస్టు చేసినప్పుడు హైదరాబాద్ నుంచి వస్తుండగా ఆనాటి ప్రభుత్వం చేసిన దిగ్బంధనాన్ని మరోసారి గుర్తు చేస్తూ… విశాఖ విమానాశ్రయం నుంచి నగరంలోకి వస్తున్నప్పుడు ప్రజలకు అభివాదం చేయడాన్ని చేయిపట్టి ఆపిన పోలీస్ అధికారి తీరుపై నేను ఆగ్రహించలేదు. ఎందుకంటే అది నన్ను రెచ్చగొట్టడానికి వేసిన ఎత్తుగడగా భావించాను. నగరంలోకి వచ్చి హోటల్ లో ఉన్నప్పుడు పోలీసులు దొరికిన వారిని దొరికినట్టు పోలీస్ స్టేషన్ కి తరలించి 15 మందిపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. హోటల్ ని దిగ్బంధనం చేశారు. మా నాయకుల్ని భయభ్రాంతులకు గురి చేశారు. అయినా ఆనాడు నాకేమైపోతుందన్న భయంతో వేలాది మంది ప్రజలు హోటల్ దగ్గరకు తరలిరావడం నేనెప్పటికీ మర్చిపోను.
• మూడేళ్లు నిండని కూతుర్ని ఎత్తుకుని మరోచేత్తో జనసేన జెండా పట్టుకుని హోటల్ ఎదుట కూర్చున్న యువతి నా దృష్టిని ఆకర్షించింది. నేను సైతం నీ కోసం ఉన్నానని ఆమె తెలియజేయడం ప్రజాభిప్రాయంలో ఒక భాగంగా నేను భావించాను.
• శ్రీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సందర్భంలో హైదరాబాద్ నుంచి వస్తుండగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో నా కారుని ఆపేసి నన్ను దిగ్బంధనం చేశారు. ఆనాడు కూడా వర్షం జల్లులు పడుతున్నా అర్ధరాత్రి అయినా ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. అందులో మా ఆడపడుచులు ఎక్కువగా ఉండడం విశేషం. ఇటువంటి సంఘటనలు నన్ను మరింత బలవంతుడిని చేశాయితప్ప బలహీనంగా మార్చలేదు.
నియోజకవర్గంలో మీకు ఎటువంటి సమస్యలు ఎదురైనా నా దృష్టికి తీసుకువస్తే నావంతు పరిష్కారానికి నేను కృషి చేస్తానని ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చారు. ముఖ్యంగా కూటమి గురించి మాట్లాడుతూ… మన నాయకులంతా సందర్భం, అవసరం వచ్చినప్పుడు కూటమి గురించి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కూటమికి సంబంధించి ఎక్కువ విషయాల్లో మనమంతా ఏకాభిప్రాయంతో ముందుకు కొనసాగాలి. కలసి పని చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. వాటిని సమయానుకూలంగా అధిగమిద్దాం. కూటమి విచ్ఛిన్నం అవుతుందన్న ఆలోచనలకు ఎటువంటి పరిస్థితుల్లోనూ లోనుకాకండి. అసలు ఆ ఆలోచన రానీయొద్దు. అలయెన్స్ ఎందుకు అవసరం అంటే… ప్రజలు అభివృద్ధిని కాంక్షిస్తున్నారు. అందువల్ల ప్రజల కోరిక మేరకు మనమంతా కలిసి ముందుకు సాగాలి. అయితే అలయెన్స్ లో ఉన్నా పార్టీపరంగా ఎలా బలపడాలి అని ఆలోచించాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి. మన అలయెన్స్ ఒక రాష్ట్రానికే కాదు ఈ దేశానికీ అవసరం.
జనసేనకు తుపాన్ శక్తి ఉందన్న సత్యాన్ని దేశవ్యాప్తంగా అంతా విశ్వసిస్తున్నారు. ఉరవడితో ప్రవహించే నీటికి టర్బైన్ పెడితే విద్యుత్ ఉత్పత్తి అయినట్టు జనసేనలో ఉన్న యువకులు, మహిళల శక్తిని దేశ అభివృద్ధి కోసం మనం మలచుకోవాలి. 2024 ఎన్నికల ఫలితాల గురించి ప్రస్తావిస్తూ… ఎన్నికల నాటికి ఉన్న పరిస్థితులను బట్టి మన శక్తి ఎంతో అంచనా వేసుకునే 21 స్థానాల్లో పోటీకి దిగినట్టు చెప్పారు. అయితే అంతకు మించి మనకు బలం ఉన్నప్పటికీ ఆ బలాన్ని ప్రజలు కాంక్షిస్తున్న అభివృద్ధి కోసం కూటమిలోని పార్టీలకు బదలీ చేశాము. రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమిగా ఏర్పాటు కావడం వల్లే ఎన్నికలు న్యాయబద్దంగా జరిగాయి. ఓటింగ్ సజావుగా సాగింది. ఇటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని మన శక్తిని అంచనా వేసుకుని వచ్చే ఎన్నికల్లో ముందుకు వెళ్దాం. డీలిమిటేషన్ లో నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఎలానూ ఉంది.
నిబద్దత కలిగిన కూటమి కారణంగా కూటమిలో ఉన్న అన్ని పార్టీలు బలపడతాయి. తద్వారా యువ నాయకులకు మేలు కలుగుతుంది.
ఈ సమావేశంలో శ్రీమతి లోకం మాధవి గారు ప్రవేశపెట్టిన సోషల్ మీడియా విచ్ఛిన్న పోకడలు తీర్మానం సమర్ధిస్తూ… వ్యక్తుల స్వేచ్ఛ ముఖ్యంగా మహిళలను కించపర్చే వ్యవస్థీకృత నేరగాళ్లపై దృష్టి సారించవలసిన అవసరం ఉందని అన్నారు. సోషల్ మీడియాలో విపరీత పోకడలు నివారించడానికి తప్పనిసరిగా బలమైన చట్టం తీసుకురావాలని తెలిపారు. ఇందుకు సంబంధించి త్వరలోనే ఆయా రంగాల్లో నిఫుణులైన వ్యక్తులతో ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని తెలియజేశారు.
తొలుత స్వాగతోపన్యాసం చేసిన రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి, పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ.. చట్ట సభల్లో మన శాసన సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ప్రజా సమస్యలు, నియోజకవర్గాల సమస్యలపై బలంగా గళం వినిపించాలన్నారు.
శాసన సభలో యువత, మహిళల సమస్యల మీద దృష్టి పెట్టాలన్నారు. నియోజకవర్గాల్లో జనసైనికులు, వీరమహిళలను ప్రోత్సహించాలని సూచించారు. పార్టీ కార్యక్రమాల మీద వారానికి ఒకసారి అయినా దృష్టి పెట్టాలన్నారు.
ఈ సమావేశంలో శాసన సభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, పార్లమెంటు సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారు, శాసన సభ్యులు శ్రీమతి లోకం మాధవి గారు ప్రవేశపెట్టిన తీర్మానాలను ఆమోదించారు. సమావేశంలో రాష్ట్ర మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు, పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు పాల్గొన్నారు.