శ్రీకృష్ణుని బోధనలు ఆచరణీయం

భారత్ న్యూస్ రాజమండ్రి ….శ్రీకృష్ణుని బోధనలు ఆచరణీయం

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

సోమందేపల్లి/పెనుకొండ : భగవద్గీత అంటే కేవలం మతపరమైన గ్రంథమే కాదని, సమాజాన్ని సన్మార్గంలో నడిపే దిక్సూచి అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. శ్రీకృష్ణుని బోధనలు నేటి సమాజానికి ఎంతో అవసరమని, ఆచరణీయమని వెల్లడించారు. సోమందేపల్లి మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ బీకే. పార్థసారధితో కలిసి మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ, మహా విష్ణువు ఎనిమిదో అవతారంగా శ్రీకృష్ణుని జన్మాష్టమి జరుపుకుంటామన్నారు. అధర్మంపై ధర్మానిదే తుది విజయమని శ్రీకృష్ణుని జననం బోధిస్తోందన్నారు. భగవద్గీత కేవలం మతపరమైన గ్రంథమే కాదని, కాలాతీతమైన జ్ఞానాన్ని, మానవాళికి కర్తవ్య బోధ, జీవిత సత్యాలను తెలియజేస్తోందని వెల్లడించారు. నేటి సమాజంలో భగవద్గీత పఠనం ఎంతో అవసరమని, శ్రీకృష్ణుని బోధనలు ఆచరణీయమని మంత్రి సవిత తెలిపారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడి బోధనల సారాంశాన్ని పలు కార్పొరేట్ సంస్థలు తమ కార్యకలాపాల్లో సైతం అనుసరిస్తుంటాయన్నారు.

శ్రీకృష్ణుని బోధనలతో చంద్రన్న పాలన

విధి నిర్వహణలో చిత్తశుద్ధి ఎంత అవసరమో భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించాడని మంత్రి సవిత తెలిపారు. శ్రీకృష్ణుని బోధనలను సీఎం చంద్రబాబు తూ.చ. తప్పకుండా పాటిస్తున్నారన్నారు. రాష్ట్రాభివృద్ధికి రేయింబవళ్లు కృషి చేస్తున్నారన్నారు. రాగద్వేషాలకతీతంగా, కక్ష సాధింపులకు తావులేకుండా పాలన సాగిస్తున్నారని సీఎం చంద్రబాబును మంత్రి సవిత కొనియాడారు.

కుట్రలు ఛేదిస్తూ…ఐక్యంగా ఉందాం…

వెనుబడిన తరగతుల మధ్య మనస్పర్థలు సృష్టించి ఆ కులాల మధ్య సఖ్యతను దెబ్బతీయాలని కొందరు కుట్రలు పన్నుతున్నారని, వాటిని బీసీలు ఐక్యం ఎదుర్కోవాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. బీసీలంతా ఒకేతాటిపై ఉన్నప్పుడే సమస్యలు పరిష్కారమవుతాయని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ కార్పొరేషన్ చైర్మన్ వెంకట శివుడు యాదవ్, పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, శ్రీకృష్ణుని భక్తులు తదితరులు పాల్గొన్నారు.